ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఎమ్మెల్యే టికెట్‌ రాకుండా కుట్ర చేసింది పెద్దిరెడ్డే: వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం - YSRCP

YSRCP MLA Adimulam Sensational Comments: మంత్రి పెద్దిరెడ్డిపై సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్ర విమర్శలు చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా కుట్ర చేసింది పెద్దిరెడ్డే అని ఆరోపించారు. పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారని అన్నారు. రేయింబవళ్లు కష్టపడ్డానని, పార్టీకి విశ్వాసపాత్రుడిగా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

YSRCP_MLA_Adimulam_Sensational_Comments
YSRCP_MLA_Adimulam_Sensational_Comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 2:18 PM IST

నాకు ఎమ్మెల్యే టికెట్‌ రాకుండా కుట్ర చేసింది పెద్దిరెడ్డే: వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం

YSRCP MLA Adimulam Sensational Comments: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సత్యవేడు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్‌ రాకుండా పెద్దిరెడ్డే కుట్ర చేశారని ధ్వజమెత్తారు. గత నెలలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనను పిలిచారని అన్నారు. అన్నా మీరు ఎంపీగా పోటీ చేయాలన్నారని తెలిపారు. అయితే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోవడానికి 2 కారణాలు చెప్పాలని అడిగానని పేర్కొన్నారు. తనకిష్టం లేకపోయినా సరే తిరుపతి ఎంపీగా వెళ్లాల్సిందే అన్నారని ఆదిమూలం విమర్శలు గుప్పించారు.

ఆ స్థానాల్లో ప్రకటించగలరా: అసలు తాను ఏం తప్పు చేశానని, ఎంపీగా ఎందుకు పంపుతున్నారని అడిగానని ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా ఈ అంశంపై తనను తీవ్రంగా హింస పెట్టారని, తాను ఎంతగానో బాధపడ్డానని ఆదిమూలం తెలిపారు. తనను ఎంపీగా వెళ్లమనడం, పెద్దిరెడ్డి కుట్రలో భాగమే అని మండిపడ్డ ఆదిమూలం, చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అంటూ ప్రశ్నించారు.

రేయింబవళ్లు కష్టపడ్డా: ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా వెళ్లేలా చేయాలన్నది పెద్దిరెడ్డి కుట్ర అన్న ఆదిమూలం, రేయింబవళ్లు కష్టపడ్డానని, పార్టీకి ఎంతో విశ్వాసపాత్రుడిగా ఉండి పని చేశానని ఆదిమూలం తెలిపారు. పెద్దిరెడ్డి చెప్పిన మనుషులకు వివిధ పదవులు ఇచ్చానని అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సత్యవేడు నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని చెప్పారు.

పెత్తందార్లకే పెత్తనం అప్పగిస్తున్న జగన్‌ - అగ్రవర్ణాల కిందే ఎస్సీ నియోజకవర్గాలు

అక్రమాలను నాపై తోశారు: అధికార, విపక్ష నేతల్లో ఎవరిపైనా కేసులు పెట్టలేదని అన్నారు. నియోజకవర్గంలో ఎవరిపై అయినా కేసులు పెట్టినా డీఐజీతో చెప్పి రాజీ చేయించానని చెప్పారు. నియోజకవర్గం ప్రశాంతంగా ఉండేందుకు ఎంతగానో పాటుపడ్డానన్న ఆదిమూలం, పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యవేడు స్థానంలో పెద్దిరెడ్డి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్న ఆదిమూలం, అక్రమాలన్నింటినీ తనపై తోసి సత్యవేడు నుంచి తప్పించారని మండిపడ్డారు.

పెద్దిరెడ్డి ఆస్తులు ఇప్పుడు ఎంత:1989లో మోటారు సైకిల్‌పై తిరిగిన పెద్దిరెడ్డికి, ఇప్పుడు ఎన్నో ఆస్తులు ఉన్నాయని ప్రశ్నించారు. మాజీ మంత్రి చెంగారెడ్డిని అడిగితే పెద్దిరెడ్డి నాటి ఆస్తులెంతో చెబుతారని అన్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అయిన తనను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. నిజాయతీగా ఉన్న తనకు మాత్రమే ఎందుకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్దిరెడ్డి కంటే పార్టీలో నేనే సీనియర్‌ని:వైసీపీపై సైతం ఆదిమూలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా అంటూ ప్రశ్నించారు. తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేనైనా తనకు తెలియకుండా సమావేశం నిర్వహిస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఇదేనా మీరు చెబుతున్న విశ్వసనీయత, వ్యక్తిత్వం అంటూ మండిపడ్డారు. పెద్దిరెడ్డి కంటే పార్టీలో తానే సీనియర్‌ని అని అన్నారు.

"పెద్దాయన" ఇలాకాలో అరాచకం.. ప్రశ్నిస్తే, కేసులు-దాడులు

ABOUT THE AUTHOR

...view details