YSRCP Leaders Rejecting Lok Sabha Ticket :గత ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఏకంగా 22 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సంఖ్యాపరంగా లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొన్ని చోట్ల మెజార్టీ లక్షల్లో వచ్చింది. అలాంటి పార్టీ నేడు పోటీకి అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకపక్క సిటింగ్ ఎంపీలు తమకు సీటు వద్దంటుంటే మరోపక్క పోటీకి కొత్త అభ్యర్థులు ఎవరూ ముందుకు రావడం లేదు. బతిమాలి ఎవరో ఒకరిని నియమించినా తాము బరిలో నిలిచేది లేదని తిరగబడుతున్నారు. ఎస్సీ రిజర్వ్‌డు స్థానాలైన తిరుపతి, చిత్తూరులో అభ్యర్థులను మార్చగా వారు తిరుగుబాటు చేశారు. తనను గంగాధర నెల్లూరులోనే కొనసాగించాలని నారాయణస్వామి పట్టుబట్టారు. రాజీనామాలకు సిద్ధమని ఆయన వర్గీయులు హెచ్చరించడంతో అధిష్టానం దిగొచ్చింది. మళ్లీ నారాయణస్వామిని అసెంబ్లీకి, రెడ్డప్పను లోక్‌సభకు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.
పడిపోయిన వైఎస్సార్సీపీ గ్రాఫ్ : ఎంపీ టిక్కెట్ ఇవ్వాలంటే ఎంత ఖర్చుపెట్టగలవు పార్టీకి ఫండ్ రూపంలో ఎంత ఇవ్వగలవు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక శ్రీధర్, సంజీవ్‌కుమార్ లాంటి వారు తప్పుకోగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ను అడ్డుగోలుగా తిట్టాలన్న షరతులకు లొంగక శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి లాంటి వారు పోటీ నుంచి విరమించుకున్నారు. వీరిలో ముగ్గురు ఎంపీలు ఇప్పటికే వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. పైగా రోజురోజుకు వైఎస్సార్సీపీ గ్రాఫ్ పడిపోతుండటంతో పోటీ చేస్తే ఆర్థికంగా దెబ్బతింటామని భావించి చాలామంది విరమించుంటున్నారు . సీఎం జగన్ రెండు నెలలుగా అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేసినా ఇప్పటి వరకు 16 స్థానాల్లోనే కొత్తవారి ఎంపిక పూర్తయింది. తిరుపతి ఎంపీ గురుమూర్తిని తొలుత సత్యవేడు అసెంబ్లీకి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను తిరుపతి లోక్‌సభకు మార్చారు. ఎమ్మెల్యే తిరుగుబాటు చేయడంతో గురుమూర్తినే మళ్లీ తిరుపతిలో కొనసాగిస్తున్నారు.
సమన్వయకర్తల మార్పుల విషయంలోనూ రివర్స్ - వైసీపీ అయిదో జాబితాలో మరిన్ని సిత్రాలు
బ్రతిమాలుతున్న జగన్ :కాకినాడ నుంచి ఈసారి ఎంపీగా పోటీచేయనని వంగా గీత చెప్పడంతో ఆమెను పిఠాపురానికి మార్చారు. అయితే కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు వేరే వాళ్లు ఎవరైనా వస్తే సరేసరి లేకుంటే మళ్లీ మీరే బరిలో దిగాలన్న షరతుతోనే ఆమెను అక్కడికి మార్చారు. ఒక నెల రోజుల పాటు కాకినాడ లోక్‌సభ సమన్వయకర్తగా ఉండాలంటూ చలమలశెట్టి సునీల్‌ను బతిమాలుకుని బాధ్యతలు అప్పగించారు. తనకు ఇచ్చిన నెల రోజులు గడువు పూర్తవ్వడంతో తాను లోక్‌సభ బరిలో ఉండనని తేల్చి చెప్పడంతో సీఎం సహా అందరూ మరోసారి బతిమాలుకుని ఆయనతో మమా అనిపించారు.
కర్నూలు వెళ్లేది లేదు :కర్నూలు ఎంపీ స్థానానికి మంత్రి జయరాంను, అనంతపురానికి ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, అరకుకు భాగ్యలక్ష్మిని, నరసరావుపేటకు అనిల్ యాదవ్‌ను, తిరుపతికి ఆదిమూలం, శ్రీకాకుళం ఎంపీ స్థానానికి కాళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్‌ను బలవంతంగా పంపారు. వీరిలో ఆదిమూలం ఇప్పటికే తిప్పికొట్టగా మంత్రి జయరాం సైతం కర్నూలు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. శంకరనారాయణ సైతం తాను అసెంబ్లీకే పోటీ చేస్తానంటున్నారు. టెక్కలి సీటు ఆశించిన తిలక్ సైతం ఇబ్బందిపడుతున్నారు. భాగ్యలక్ష్మి పరిస్థితి అంతే.