YSRCP Leaders Land Grabs Worth Thousands of Crores:వైఎస్సార్సీపీ నేతల జోక్యంతో భూముల రికార్డులు తారుమారవుతున్నాయి. రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తూ, ప్రలోభాలకు గురి చేస్తూ తమకు అనుకూలంగా రికార్డులను మార్చేసుకుంటున్నారు. ఇదే అదనుగా భావించి కొంతమంది రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు డీకే పట్టాల రూపంలో ధారదత్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులపేర్లతోనూ రాసేసుకుంటున్నారు. భూయజమానుల నిర్థారణ, విస్తీర్ణం, సర్వే నంబర్లకు ప్రామాణికంగా తీసుకునే వెబ్‌ల్యాండ్‌లో ఉండే వివరాలను బ్యాంకుల రుణాలు ఎక్కువ మొత్తంలో పొందేందుకు వీలుగా కూడా మార్చేస్తుండడం గమనార్హం.
హైకోర్టు సైతం ఆగ్రహం: మ్యుటేషన్ విషయంలోనూ వీరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వెబ్‌ల్యాండ్‌కు సంబంధించిన డిజిటల్‌కీని తహసీల్దార్లకు తెలియకుండా కింది స్థాయి సిబ్బంది దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు వైసీపీ పాలనలో భారీగా వెలుగులోకి వచ్చాయి. వీటిలో విచారణ వరకు వచ్చిన కేసులు కొన్ని మాత్రమే. ఏకపక్షంగా భూ రికార్డుల్లో పేర్లు మార్చడంపై ఇటీవల హైకోర్టు సైతం మండిపడింది.
- నెల్లూరు జిల్లా కలిగిరి మండలలో ఓ వ్యక్తి తమ సొంత భూములను ప్రభుత్వానికి చెందినవిగా మార్చారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పశ్చిమగోదావరి జిల్లా వాసి ఒకరు తమ పేరుమీద ఉన్న భూమిని ఇతరుల పేర్లతో మార్చారని హైకోర్టులో పిటిషన్‌ను వేశారు. ఈ రెండు కేసుల్లో సంబంధితులకు నోటీసులు ఇచ్చి వారి వాదన వినకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని రెవెన్యూ సిబ్బందిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
- భూ యజమానిగా నిర్థారించేందుకు అవసరమైన మ్యుటేషన్ల విషయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మరో ఉద్యోగి ఈ అక్రమాలకు పాల్పడ్డారు.
- పల్నాడు జిల్లాలో బ్యాంక్ నుంచి రూ.5 లక్షల రుణం పొందేందుకు వీలుగా వెబ్‌ల్యాండ్‌లో తహసీల్దార్ ఒకరు అక్రమ ఎంట్రీలు వేశారు.
- ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి మండలంలో నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని వారసత్వం కింద మార్చి ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేశారు. శింగనమల మండలలోని ఏడు గ్రామాల పరిధిలో ఉన్న 166 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో నమోదు చేశారు.
- ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దపంజిని మండలంలో ఓ తహసీల్దారు 24 గంటల్లో రిలీవ్ కావాల్సి ఉండగా ముందురోజు అక్రమంగా వెబ్‌ల్యాండ్‌లో కొన్ని భూముల వివరాలను మార్చేశారు. ఈ వ్యవహారాలు చాలా మేరకు స్థానిక వైసీపీ నాయకుల కనుసన్నల్లో జరగడం గమనార్హం.