Vijayasai Reddy on Jagan Comments: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాణ్నేనని తెలిపారు. తాను ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని తేల్చిచెప్పారు. తనలో ఏమాత్రం భయం అనేదే లేదని స్పష్టం చేశారు. భయం లేనందునే ఎంపీ, పార్టీ పదవులనే వదులుకున్నానని తెలిపారు. భయం లేనందునే రాజకీయాలనే వదులుకున్నట్లు స్పష్టం చేశారు.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 7, 2025
YS Jagan Comments: కాగా వైఎస్సార్సీపీని వీడిన రాజ్యసభ ఎంపీలపై శుక్రవారం మీడియా సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వాసం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రలోభాలకు లొంగకుండా, భయపడకుండా ఉండాలని అన్నారు. ఎప్పుడూ కూడా వ్యక్తిత్వం తగ్గించుకోకూడదని చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి సహా పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎవరికి అయినా సరే ఇదే వర్తిస్తుందన్నారు. ఇంకా ఒకరో, ఇద్దరో వెళ్లిపోయేవాళ్లు ఉంటే వాళ్లకి అయినా సరే ఇదే వర్తిస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ నేడు ఉందంటే అది నాయకుల వల్ల కాదని, కార్యకర్తల వల్లేనని జగన్ చెప్పారు.
విజయసాయి రెడ్డి రాజీనామా: గత నెల 24వ తేదీన విజయసాయిర రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆ మరుసటి రోజే రాజీనామా చేశారు. అదే విధంగా తాను మరో రాజకీయపార్టీలో చేరడంలేదని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని ట్వీట్లో చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేసుకుంటానంటూ తెలిపారు. అయితే ఇదంతా వైఎస్ జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే జరిగింది.
ఆ సమయంలో సాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందించలేదు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో సాయిరెడ్డి పార్టీని వీడటంపై స్పందించారు. దీంతో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ప్రస్తుతం విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు భయం లేనందునే ఎంపీ, పార్టీ పదవులను సైతం వదులుకున్నానంటూ చెప్పారు. అదే విధంగా తాను ఎవరికి, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని క్లారిటీ ఇచ్చారు.