ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించిందా? - చేరికల విషయంలో ఎందుకీ గందరగోళం - YSRCP LEADERS JOININGS

నేతలను చేర్చుకునే విషయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించిందనే విమర్శలు - ఐదేళ్ల పోరాటంలో కీలకంగా వ్యవహరించిన కింది స్థాయి కేడర్‌కి మింగుడుపడని వైనం

ysrcp_leaders_joinings
ysrcp leaders joinings (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2024, 10:38 PM IST

YSRCP LEADERS JOININGS:జగన్‌ ప్రభుత్వంలో ఇష్టానుసారంiా వ్యవహరించి ఇప్పుడు తమ స్వార్ధం కోసమో, రాజకీయ భవిష్యత్తు కోసమో, తాత్కాలిక అవసరాల కోసమో వైఎస్సార్సీపీని వీడుతున్న నేతలను చేర్చుకునే విషయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ బలోపేతం కోసమో లేక మనం కాదంటే వేరే పార్టీకి వెళ్తారనో, ఎవరిని పడితే వారిని చేర్చుకుంటుండటం కేడర్​కు మింగుడు పడడం లేదు. కేసుల భయంతోనో, విచారణ ఎదుర్కోవలసి వస్తుందనో కొందరు నాయకులు వైఎస్సార్సీపీని వీడి కూటమి పార్టీల్లో చేరుతుండడాన్ని, ఐదేళ్ల పోరాటంలో కీలకంగా వ్యవహరించిన కింది స్థాయి కేడర్‌ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతోంది.

స్పష్టంగా కనిపిస్తోన్న సమన్వయ లోపం: జగన్‌ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలుగా చెలరేగిపోయి, విపక్ష నాయకులు, కార్యకర్తల్ని అక్రమ కేసులు, అరెస్టులతో వేధించిన వైఎస్సార్సీపీ నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీలను ఆశ్రయిస్తున్నారు. కొందరు ఇప్పటికే మూడు పార్టీల్లో ఏదో ఒకదానిలో చేరిపోయారు. కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశంలో చేరేందుకు ప్రయత్నించి సాధ్యమైతే అక్కడ, కాకపోతే జనసేన లేదంటే బీజేపీ అన్నట్లుగా వీరి చేరికలుంటున్నాయి. ఇలా వైఎస్సార్సీపీ నుంచి వస్తున్న వారిలో ఎవర్ని చేర్చుకోవాలి, ఎవర్ని చేర్చుకోకూడదు, ఎలాంటివారిని చేర్చుకుంటే పార్టీకి ఉపయోగం అనే విషయంలో కూటమి పార్టీల మధ్య అంతర్గతంగా చర్చ జరగట్లేదు. సమన్వయ లోపం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని మూడు పార్టీల కార్యకర్తలు భావిస్తున్నారు.

"గుడ్ బై జగన్" - వలసబాటలో వైఎస్సార్సీపీ నేతలు

పార్టీల మధ్య చర్చలు లేవు: ఐదేళ్లపాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించి, దోపిడీకి పాల్పడి, తమను కేసులతో వేధించిన వైఎస్సార్సీపీ నాయకుల్ని పరస్పరం సంప్రదించుకోకుండానే కూటమి పార్టీలు చేర్చుకుంటున్నాయన్న అసంతృప్తి కేడర్‌లో వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో మొదలు పెట్టి విశాఖ డెయిరీ ఛైర్మన్‌ అడారి ఆనంద్‌కుమార్‌ వరకు కొన్ని నెలలుగా జరిగిన వైఎస్సార్సీపీ నాయకుల చేరికలే దీనికి నిదర్శనమమని కూటమి పార్టీల కేడర్‌ భావిస్తోంది. ఇలాంటి విషయాల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం ఏర్పాటైన కమిటీని ఎన్నికల తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారని, అడపాదడపా మూడు పార్టీల అగ్రనేతలు సమావేశమవడమే తప్ప, పార్టీల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరగడం లేదన్న అభిప్రాయం కేడర్‌లో వ్యక్తమవుతోంది.

అదే సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు కొందరిని చేర్చుకోవడం పార్టీల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అవసరమేనని భావిస్తోంది. వారిని చేర్చుకోవడం వల్ల వైఎస్సార్సీపీలో ఆ స్థాయి నాయకులు ఇప్పట్లో తయారవడం సాధ్యం కాదని, ఆ పార్టీ కేడర్‌ కకావికలమవుతుందని, వైఎస్సార్సీపీని మరింత బలహీనపరిచే దిశగా అది అవసరమేనని భావన కూటమి పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఇంకొంత మంది విషయంలో వారిని చేర్చుకోవడం వల్ల పార్టీ లాభపడుతుందన్న ఉద్దేశంతో కేడర్‌ సర్దుకుపోతోంది.

'ప్రజాతీర్పును జగన్ గౌరవించకపోతే ఎలా?' - వైఎస్సార్సీపీకి మరో ఇద్దరు గుడ్​ బై

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదట్లో కొన్ని సంవత్సరాలు తప్ప ఈ నాలుగు దశాబ్దాల్లో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవటం ఇదే తొలిసారి. మోపిదేవి వెంకటరమణరావు, బీద మస్తాన్‌రావు వైఎస్సార్సీపీకి, పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరడం, ఆ రెండు స్థానాల నుంచీ టీడీపీ అభ్యర్థులు ఎంపికవడంతో ఆ లోటు భర్తీ అయింది. అందుకే వారిని చేర్చుకోవడాన్ని పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కేడర్‌ అర్ధం చేసుకుంది. ఎవర్ని చేర్చుకోవాలన్నా మూడు పక్షాలు కూర్చుని నిర్ణయించుకోవాలని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. చాలా సందర్భాల్లో అది జరగడం లేదని, వైఎస్సార్సీపీ నుంచి వస్తున్నవారు మూడు పార్టీల్లోని ఎవరో ఒక నాయకుడిని ఆశ్రయించడంతోనే చేర్చేసుకుంటున్నారని కేడర్‌ మదన పడుతోంది. కూటమి పార్టీల్లోకి ఎవరిని చేర్చుకోవాలన్నా దానికి పార్టీల ప్రయోజనాలే పరమావధి కావాలని మూడు పార్టీ కార్యకర్తల ఆకాంక్ష.

టీడీపీ కేడర్‌ను వేధించిన నేతలు వీరే:జగన్‌ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేడర్‌ను తీవ్రంగా వేధించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక జనసేనలో చేరిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌పై అప్పట్లో ఆయన 23 అక్రమ కేసులు పెట్టించారు. ప్రతి కేసులోను 30 నుంచి 60 మంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. చంద్రబాబుని జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులో జైలుకి పంపినప్పుడు ఆందోళన చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు 18 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, రిమాండ్‌కి పంపించారు. వారంతా ఇప్పుడు కోర్టుకి తిరుగుతుండగా, భూకబ్జాలు, అవినీతి వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలినేని మాత్రం జనసేనలో చేరిపోయారు.

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మట్టి అక్రమ క్వారీయింగ్, ఇసుక, మద్యం అక్రమ రవాణా వంటి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జనసేనలో చేరిపోయి, ఏకంగా ఆపార్టీ జిల్లా అధ్యక్షుడైపోయారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య వైఎస్సార్సీపీ హయాంలో తెలుగుదేశం నాయకులపై తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడ్డారు. ఆయన కోట్లలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో రోశయ్య గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు జరిగిన కొన్ని రోజులకే జనసేన గూటికి చేరారు.

'జగన్​కు బాధ్యత లేదు - గుడ్ బుక్​ కాదు గుండె బుక్ ఉండాలి' - వైఎస్సార్సీపీకి రాజీనామా

ఇటీవలి ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ స్థానానికి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడారి ఆనంద్‌కుమార్‌ విశాఖ డెయిరీలో తీవ్రస్థాయి అవకతవకలకు పాల్పడినట్టు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అక్రమాలపై విచారణకు శాసనసభా సంఘాన్ని నియమించారు. ఆనంద్‌ను కఠినంగా శిక్షించాలని స్పీకర్‌ సహా అందరూ చెబుతుంటే, ఆయన బీజేపిలో చేరిపోయారు. ఇప్పుడు సభాసంఘం ఎవర్ని విచారించాలి? కూటమి పార్టీలనా? అనే ప్రశ్నలు కేడర్‌ నుంచి వినిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డిని కూడా ఒక దశలో బీజేపీలో చేర్చుకునేందుకు సిద్ధపడ్డారు. పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వస్తామని చెప్పినా కళ్లు మూసుకుని చేర్చేసుకునేలా ఉన్నారన్న వ్యాఖ్యలు పార్టీ కేడర్‌ నుంచి వినిపిస్తున్నాయి.

జగన్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరేందుకు అంతా సిద్ధమైన దశలో స్థానిక కేడర్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఆపారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, శిద్ధారాఘవరావు లాంటివారు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరేందుకు క్యూలో ఉన్నారు.

బీజేపీలో చేరిన విశాఖ డెయిరీ అధినేత ఆడారి ఆనంద్ కుమార్

ABOUT THE AUTHOR

...view details