TDP Ra kadali Ra Meetings in Nellore and Palnadu : అధికార వైఎస్సార్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు నేడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. హైదరాబాద్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పసుపు కండువా కప్పుకున్నారు. నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గురజాలలో లావు శ్రీకృష్ణ దేవరాయులు టీడీపీలో చేరనున్నారు. NTR జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సైకిల్ ఎక్కుతున్నారు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈ ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. వసంత వెంట వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీపీలు, సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు సహా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు.
Chandrababu Tour : వైసీపీకి మళ్లీ ఓటేస్తే.. ప్రజలకు గొడ్డలి పోటే : చంద్రబాబు
నెల్లూరు VPR కన్వెన్షన్ హాల్ వేదికగా నిర్వహిస్తున్న భారీ సభా వేదికగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakar reddy), ఆయన సతీమణి ప్రశాంతి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు నేడు తెలుగుదేశంలో చేరనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు చంద్రబాబు నెల్లూరు చేరుకుంటారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోకి వచ్చారు. ఈ రోజు సభ తర్వాత మండల, డివిజన్, నెల్లూరు కార్పొరేషన్ స్థాయి నాయకులు కూడా తెలుగుదేశంలో చేరనున్నారు.
కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైంది - వచ్చే ఎన్నికల్లో పాండవులదే గెలుపు
నెల్లూరులో సభ తర్వాత సాయంత్రం 4గంటలకు హెలికాఫ్టర్‌లో చంద్రబాబు దాచేపల్లి చేరుకుంటారు. దాచేపల్లి (Dachepalli) జరిగే రా కదిలిరా సభలో పాల్గొంటారు. ఈ సభా వేదికగానే టీడీపీలో చేరనున్నట్లు లావు కృష్ణదేవరాయలు ప్రకటించారు. పల్నాడు అభివృద్ధి కోసం ప్రజలకు తనకు మద్దతివ్వాలని కోరారు. దాచేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రా కదలిరా సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మంది అభిమానులు, కార్యకర్తలు హాజరవుతారని నాయకులు అంచనా వేస్తున్నారు. నరసరావుపేట పార్లమెంటరీ పరిధిలో తెలుగుదేశం - జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని తెలుగుదేశం నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.