Nandigam Suresh Escaped When Police Went to Arrest Him:వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్‌కు నిరాకరిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 2 వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ నేతలు ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై హైకోర్టు నిర్ణయం వెలువరించింది. వైఎస్సార్సీపీ నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడికేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు.
పరారీలో నందిగం సురేష్:నందిగం సురేష్ హైకోర్టులో పిటీషన్‌ను కొట్టేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. నందిగం సురేష్‌ను అరెస్టు చేసేందుకు తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు. తుళ్లూరు సీఐ వెంకటేశ్వర్లు, మరో 15 మంది సిబ్బందితో సురేష్ నివాసానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సురేష్ అక్కడి నుంచి పారిపోయారు. దాదాపు 15 నిమిషాలు ఎదురు చూసిన పోలీసులు సురేష్ రాకపోవడంతో వెనుదిరిగారు. సురేష్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపడతున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఈ ఉదయం నుంచి ఏయే ప్రాంతంలో సురేష్ ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఎలాగైనా అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.