YS Sharmila Comments on Jagan for Protesting in Assembly:జనాలు ఛీకొడుతున్నా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తీరు మాత్రం మారడం లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నేడు అసెంబ్లీకి వచ్చింది 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండేందుకా? అని నిలదీశారు. ప్రజా సమస్యల కన్నా జగన్కు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా అని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి జగన్కు ప్రతిపక్ష హోదానే కావాలా అని షర్మిల అన్నారు. ప్రజల శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే ప్రజాసమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని హితవుపలికారు. సభకు వెళ్లే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని షర్మిల పేర్కొన్నారు.