YS JAGAN WARNING TO PULIVENDULA DSP: వైయస్సార్ జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ బెదిరింపులకు దిగారు. ఈ ప్రభుత్వం రెండు నెలల్లో లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చని, ఆ తర్వాత మీ కథ ఉంటుందంటూ హెచ్చరికలు చేశారు.
జగన్ సమీప బంధువు, వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ తిరుగు ప్రయాణంలో హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో వివిధ విచారణల్లో భాగంగా డీఎస్పీ దూకుడుగా ప్రదర్శిస్తున్నాడంటూ ఆయనపై జగన్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించారు. ఈ సమయంలో హెలిప్యాడ్ వద్ద ఆగిన జగన్, డీఎస్పీని తన వద్దకు పిలిపించుకున్నారు.
మౌనంగా విని అక్కడి నుంచి వెళ్లిపోయిన డీఎస్పీ:బందోబస్తు విధుల్లో దూరంగా ఉన్న డీఎస్పీ వెంటనే తనతో పాటు మరో ఇద్దరు సీఐలను వెంటబెట్టుకుని జగన్ వద్దకు వెళ్లారు. డీఎస్పీని ఉద్దేశించి జగన్ తీవ్ర స్వరంతో ఆవేశంతో మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండమంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఈ సమయంలో డీఎస్పీ మౌనంగా వింటూ వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సామాజిక మాధ్యమంలో అసభ్యకర పోస్టుల కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులో రిమాండ్ ఖైదీ వర్రా రవీందర్రెడ్డి పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు.