ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

"ఆలోచన, ప్రవర్తనలో మార్పు వస్తే ప్రేమ పునరుద్ధరిస్తా" - షరతులు వర్తిస్తాయన్న జగన్‌ - JAGAN LETTER LEAK

షర్మిల ఆలోచన, ప్రవర్తనలో మార్పులు వస్తే తిరిగి ప్రేమ, ఆప్యాయత పునరుద్ధరిస్తానంటూ జగన్‌ ఆఫర్‌

ys_jagan_letter_to_sharmila_about_properties
ys_jagan_letter_to_sharmila_about_properties (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2024, 10:24 AM IST

Updated : Oct 24, 2024, 11:17 AM IST

YS Jagan Letter To Sharmila About Properties :సొంత తల్లి, చెల్లిపైనే కోర్టుకు ఎక్కిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయంగా తనను వ్యతిరేకించినందున రాసిచ్చిన ఆస్తులు వెనక్కి తీసుకుంటానంటూ తన సోదరి షర్మిలకు రాసిన లేఖ బయటపడింది. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించినందున సోదరిపై ప్రేమ, ఆప్యాయతలు పోయాయంటూ ఆగస్టు 27వ తేదీన షర్మిలకు లేఖాస్త్రం సంధించారు. ఆలోచన, ప్రవర్తన మారితే వాటిని పునరుద్ధరిస్తానంటూ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. తన చర్యలతో బాధించినందుకే సరస్వతి పవర్‌ కంపెనీలో గిఫ్ట్‌ డీడ్‌ కింద షర్మిలకు రాసిచ్చిన వాటాల్ని వెనక్కి తీసుకుంటున్నానని వెల్లడించారు.

సత్సంబంధాలు లేనందున గతంలో ఇచ్చిన ఆస్తి వాటాల్ని రద్దు చేసుకుంటున్నానంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ ఆగస్టు 27న తన సోదరి షర్మిలకు రాసిన లేఖను ఎన్​సీఎల్టీ (NCLT) లో దాఖలు చేసిన పిటిషన్‌కు అనుబంధంగా జతపరిచారు. తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సంపాదించిన, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్ని ఆయన బతికున్నప్పుడే ఇద్దరికీ సమానంగా పంచారని లేఖలో జగన్‌ ప్రస్తావించారు. ఆ తర్వాత తన సొంత శ్రమ, పెట్టుబడితో వ్యాపారాలు మొదలు పెట్టానని వాటికి వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఎంతో ప్రేమ, ఆప్యాయతతో కొన్ని ఆస్తుల్ని షర్మిల పేరిట బదిలీ చేసి, విశ్వాసం కల్పించేందుకు గిఫ్ట్‌డీడ్‌ కింద తల్లి విజయమ్మ పేరిట కూడా కొన్ని షేర్లు రాసిచ్చానన్నారు.

న్యాయపరమైన చిక్కులు తొలిగాక భవిష్యత్తులో ఆ ఆస్తులు షర్మిలకు చెందేలా ఒప్పందం చేశానన్న జగన్‌ ఇవి కాకుండా నేరుగా, తల్లి ద్వారా గత దశాబ్దకాలంలో 200 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. అయినా కనీస కృతజ్ఞత లేకుండా షర్మిల వ్యవహరించిందని జగన్‌ మండిపడ్డారు. తన శ్రేయస్సు గురించి ఆలోచించకపోవడాన్ని ఆమె విచక్షణకే వదిలేస్తున్నానన్నారు. షర్మిల చర్యలు వ్యక్తిగతంగా తనను తీవ్రంగా బాధించడంతో ఆమెపై ప్రేమ, ఆప్యాయత తగ్గిపోయాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడినందున ప్రేమ, ఆప్యాయత చూపాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.


ఓ చెల్లి కన్నీటి గాథ - అన్నపై ఎక్కుపెట్టిన బాణం

షర్మిల ఆలోచనలో, ప్రవర్తనలో ఏదైనా సానుకూల మార్పులు వస్తే తిరిగి ప్రేమ, ఆప్యాయత పునరుద్ధరిస్తానంటూ జగన్‌ ఆఫర్‌ ప్రకటించారు. కోర్టు కేసులన్నీ పరిష్కారమయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎంత చేయాలి? అనే అంశాలు తిరిగి పరిశీలిస్తానని వెల్లడించారు. తనకు, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.భారతికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని జగన్‌ షరతు పెట్టారు. రాజకీయంగా తనకు వ్యతిరేకంగా ఉండొద్దంటూ జగన్‌ మరో లేఖ షర్మిలకు రాసినట్లు తెలుస్తోంది.

ప్రేమ 'చెల్లి'పోయింది - ఆస్తుల వివాదంపై కోర్టుకెక్కిన జగన్

Last Updated : Oct 24, 2024, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details