YS Jagan Government Pushed Andhra Pradesh Into Debt :వైఎస్ జగన్ హయాంలో ఆర్థిక నిర్వహణ వైఫల్యాలు, అస్తవ్యస్త నిర్ణయాల ఫలితంగా నేడు రాష్ట్ర అప్పులు, చెల్లింపుల భారం ఏకంగా రూ.10.86 లక్షల కోట్లకు చేరింది. జగన్ సర్కారు ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలతో రాష్ట్ర వాస్తవ పరిస్థితులను మరుగుపరచడంతో పాటు ఎక్కడ పుడితే అక్కడ అప్పు తెచ్చుకుని ఆ మొత్తాలను రెవెన్యూ వ్యయానికి మళ్లించేసింది. రాష్ట్ర అభివృద్ధిని పట్టాలు తప్పించింది. కొత్త ప్రభుత్వం తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విడమరిచి చెప్పారు.
అంతే కాదు రాష్ట్రంలో అప్పులు, చెల్లింపుల భారం రూ.9,74,556 కోట్లని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న నాన్‌గ్యారంటీ రుణాల మొత్తాన్ని చంద్రబాబు సభలో వెల్లడించలేదు. జగన్ హయాంలో అస్తవ్యస్త విధానాల వల్ల విద్యుత్తు సంస్థల రుణం రూ.1.12 లక్షల కోట్లకు చేరింది. నెలనెలా అప్పులు తీసుకుంటేనే డిస్కంలు ముందడుగు వేసే పరిస్థితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించింది. దీంతో డిస్కంల రేటింగ్ దారుణంగా పడిపోయింది. నాన్‌గ్యారంటీ రుణాలు, పెండింగ్ చెల్లింపులు, అప్పులు కలిపి రాష్ట్రంలో మొత్తం ఆర్థిక భారం రూ.10.86 లక్షల కోట్లకు చేరింది. 2024 జూన్ మొదటివారంలో జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న పరిస్థితి ఇది.
‘ఈనాడు’ చెప్పిన లెక్కలే :జగన్ సర్కారులో రాష్ట్ర రుణాలు, చెల్లింపుల భారాన్ని ‘ఈనాడు’ ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూనే ఉంది. 2023 డిసెంబరు నాటికి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు, చెల్లింపుల భారం రూ.10.11 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ చివరిదశలో రాష్ట్ర ఆర్థిక భారాలు (రుణాలు, పెండింగ్ చెల్లింపులు కలిపి) 2024 మే 3న రూ.10.75 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వం తాజాగా లెక్కలన్నీ వెలికితీశాక ఈ గణాంకాలన్నీ సుస్పష్టంగా బయటపడ్డాయి. నాన్‌గ్యారంటీ రుణాలు, పెండింగ్ చెల్లింపులు, అప్పులన్నీ కలిపి 2024 జూన్ మొదటి వారానికే రాష్ట్ర ఆర్థిక భారం రూ.10.86 లక్షల కోట్లకు చేరుకుంది. కొత్త ప్రభుత్వంలో చేసిన అప్పులను ఇందులో కలపలేదు.