Vizianagaram MLC By-Election Cancelled : విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేసింది. మండలి చైర్మన్ నిర్ణయంపై ఇందుకూరి రఘురాజు హైకోర్టులో సవాలు చేశారు.
మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు తప్పు పట్టింది. ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని పేర్కొంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనర్హత వేటు నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆయన ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని ఇటీవల హైకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయం మేరకు విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న జరగాల్సిన ఉపఎన్నిక ప్రక్రియను పూర్తి స్థాయిలో ఈసీఐ రద్దు చేసింది.
రఘురాజుపై అనర్హత వేటు ఎందుకంటే: ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకూ సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. గత ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు అనర్హత వేటుపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో నెలకొన్న ట్వీస్ట్కి తాజాగా ఈసీఐ పుల్‌స్టాప్ పెట్టింది. వైఎస్సార్సీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు 2021లో ఎన్నికయ్యారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడ్డారని ఆయన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ చర్యలు తీసుకోవాలని మండలిలో ఆ పార్టీ విప్ పాలవలస విక్రాంత్, మండలి ఛైర్మన్‌కు గతంలో ఫిర్యాదు చేశారు.