Vijayasai Reddy Irregularities AP : వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆర్థిక అక్రమాలకు కొమ్ముకాసి పార్టీలోనూ నంబర్-2గా విజయసాయిరెడ్డి ఎదిగారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖలో పూర్తిస్థాయిలో తిష్ఠ వేశారు. విశాఖలో ఆయనే డిఫ్యాక్టో సీఎం అనేలా చెలరేగిపోయారు. తన ఆర్థిక అరాచకాలతో సాగరతీరంలో అలజడి సృష్టించారు. కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ వంటి కీలక పోస్టుల్లో వైఎస్సార్సీపీతో అంటకాగే అధికారుల్ని నియమించుకుని, వారి అండతో విపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు దిగారు.
టీడీపీ నేతల భవనాల్ని కూలగొట్టించడం, ఆస్తుల విధ్వంసం, భూముల కబ్జాల వంటి అరాచకాలకు పాల్పడ్డారు. శని, ఆదివారాలు వస్తే ఎవరి భవనాలపైకి బుల్డోజర్లు, పొక్లెయిన్లు పంపుతారో అనేంత భయానక పరిస్థితులను సృష్టించారు. ఉత్తరాంధ్రలో ఉద్యోగుల బదిలీలు మొదలు, రాజకీయ నియామకాలు, స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వంటివన్నీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి.
విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించేందుకు విజయసాయిరెడ్డి అనేక నీచాలకు పాల్పడ్డారని విపక్షాలు విమర్శించాయి. టీడీపీలోని కీలక నేతల్ని వైఎస్సార్సీపీ చేర్చుకునేందుకు విశ్వప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. మాట వినకపోతే ఆర్థిక మూలాలపై దెబ్బకొడతామని బెదిరించి మరీ కొందర్ని ఆ పార్టీలో చేర్చుకున్నారని చెబుతారు. విశాఖ అభివృద్ధికి ప్రగతిభారతి ట్రస్టు పేరుతో పారిశ్రామికవేత్తల్ని, వ్యాపారుల్ని బెదిరించి విరాళాల పేరుతో కోట్లు వసూలు చేశారని విమర్శలున్నాయి. ఆ డబ్బులతో ఏం సేవా కార్యక్రమాలు చేశారో, ట్రస్ట్ ఎక్కడికి పోయిందో తెలియదు.
కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ : విశాఖను కార్యనిర్వాహక రాజధానిని చేస్తామన్న ముసుగులో వైఎస్సార్సీపీ నేతలు అక్కడ చేసిన ప్రతి దందా, వందల కోట్ల విలువైన భూకబ్జాల వెనుక మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డిదేనని తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయన బంధువులు, బినామీలు భారీగా ఆస్తులు కూడగట్టారు. రుషికొండలో రేడియంట్ సంస్థకు 2005లో వైఎస్ ప్రభుత్వం కేటాయించిన వెయ్యి కోట్ల విలువైన భూములు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నాయకుల పరమయ్యాయి.
మధురవాడలో ఎన్‌సీసీ సంస్థకు చెందిన సుమారు రూ.1500 కోట్ల విలువైన భూమిని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడి సంస్థ దక్కించుకుంది. తీరానికి సమీపంలో కొండపై బేపార్క్ పేరుతో నిర్మించిన వెల్‌నెస్ సెంటర్ ప్రాజెక్టు వైఎస్సార్సీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుల చేతుల్లోకి వెళ్లిపోయింది. విశాఖ - భీమిలి బీచ్‌రోడ్డులో రామానాయుడు స్టూడియోస్ భూముల్లోనూ వాటా కొట్టేశారు. కైలాసగిరికి సమీపంలో గతంలో కార్తికవనం పేరిట కేటాయించిన భూముల్లో నిర్మించిన స్టార్‌హోటల్ ఆ పార్టీ పెద్దల సన్నిహితుల పరమైంది. వీటన్నింటి వెనుక సూత్రధారి, కీలకపాత్రధారి విజయసాయిరెడ్డేనని విశాఖ అంతా కోడైకూసింది.
విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ సంస్థ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ రహదారిని ఆనుకుని అత్యంత విలువైన 87,714 చదరపు గజాల స్థలాల్ని కొనుగోలు చేసింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అప్పట్లో వాటి విలువ రూ.53 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌లో అంతకు ఎన్నో ఎక్కువ రెట్లు ఉంటుంది. కొందర్ని బెదిరించి భూములు విక్రయించేలా చేశారన్న ఆరోపణలున్నాయి. భీమిలిలో నాలుగు సర్వే నంబర్ల పరిధిలోని మూడున్నర ఎకరాల స్థలాన్ని అవ్యాన్ రియల్టర్స్ పేరిట కొని, నిర్మాణాలు చేపట్టారు.
భారీగా భూముల కొనుగోలు : కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి, సముద్ర తీరానికి కేవలం 30 గజాల దూరంలో కాంక్రీట్‌తో గోడ కట్టేశారు. ఇసుక తిన్నెల్ని జేసీబీలతో తొలగించి, నిర్మాణాలకు అనువుగా గ్రావెల్‌తో పూడ్చేశారు. అక్కడ తన కుమార్తె పేరిట విలాసవంతమైన హోటల్ నిర్మించాలన్నది విజయసాయిరెడ్డి ప్రణాళికని సమాచారం. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ వస్త్రవ్యాపారి పేరు మీద భోగాపురం పరిధిలో భారీగా భూములు కొన్నారు.