ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్‌బై - VIJAYASAI REDDY QUITS POLITICS

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి - రాజీనామా చేయనున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటన - విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన విజయసాయిరెడ్డి

Vijaya Sai Reddy Quits politics
Vijaya Sai Reddy Quits politics (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2025, 6:48 PM IST

Updated : Jan 24, 2025, 10:05 PM IST

Vijaya Sai Reddy Quits politics: రాజకీయాలకు వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు అనూహ్యంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్‌ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని పేర్కొన్నారు. రెండుసార్లు రాజ్యసభ అవకాశం ఇచ్చిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 'ఎక్స్​'లో విజయసాయి రెడ్డి ఈ విధంగా రాసుకొచ్చారు.

"రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.

రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్​కి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞుడిని. జగన్​కి మంచి జరగాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్​గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా.

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కల్యాణ్​తో చిరకాల స్నేహం ఉంది.

నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను" అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయి రాజీనామా ప్రకటనతో ప్రస్తుతం వైఎస్సార్సీపీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు పిటిషన్: మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిని విజయసాయిరెడ్డి కోరారు. నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ విజయసాయిరెడ్డి పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 10-మార్చి 10 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొన్నారు. సీబీఐ స్పందన కోసం తదుపరి విచారణను ఈనెల 27కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

"గుడ్ బై జగన్" - వలసబాటలో వైఎస్సార్సీపీ నేతలు

Last Updated : Jan 24, 2025, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details