Amit Shah Meet AP BJP Leaders :విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఏపీ బీజేపీ నాయకులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు ఈ సమావేశం కొనసాగింది. పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు. కీలక అంశాలపై రాష్ట్ర నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా సూచించారు.
అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని అమిత్ షా పేర్కొన్నారు. హైందవ శంఖారావం సభ విజయం పట్ల పార్టీ, వీహెచ్‌పీ నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై కేంద్ర హోం శాఖ దృష్టిపెట్టిందని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేతలు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, తదితురులు పాల్గొన్నారు.