History of Panipuri : నిమిషాల వ్యవధిలో ఆకలితీర్చే వంటకం అంటే పానీపూరీనే. ఇలా ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం.. అలా చేతికందుతుంది. నాలుకను లబలబలాడిస్తూ గొంతులోకి దిగిపోతుంది. పుల్లటి రసం, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఉడికించిన వేడివేడి ముద్దపప్పు, బంగాళాదుంప, గ్రీన్ పీస్ సలాడ్ కలిపి తింటుంటే.. ఆ మజాయే వేరు.
కళాశాల విద్యార్థినుల బెస్ట్ ఛాయిస్ పానీపూరీనే. ఏ ఇద్దరు స్నేహితులు కలిసినా, పార్టీ అనుకున్నా ఆరగించే పానీపూరీ అసలు ఎక్కడ పుట్టిందో, ఎవరు ముందుగా కనిపెట్టారో తెలుసా? పానీపూరీ చరిత్ర పురాణాల్లో చోటుదక్కించుకుందంటే నమ్మగలరా! వీధి చివర నాలుగు చక్రాల బండి మొదలుకుని స్టార్ హోటళ్లలోనూ వడ్డించే పానీపూరీ మహాభారత కాలం నుంచే ఉందనీ... స్వయంగా ద్రౌపది తయారు చేసిందని ఎంతమందికి తెలుసు?
అమ్మాయిలు మనసు పారేసుకునే స్ట్రీట్‌ఫుడ్ పానీపూరీని ఉత్తరాది రాష్ట్రాల్లో గోల్‌గప్పా అని పిలుస్తారు. గోల్ అంటే స్టఫ్ చేసిన గుండ్రని పూరీ అని అర్థం. గప్పా అంటే తినే పద్ధతి. ఇంతకీ ద్రౌపదికీ ఈ వంటకానికి సంబంధమేంటో తెలుకుందామా!
ద్రౌపది పాండవులను పెళ్లి చేసుకుని రాగానే అత్త కుంతీదేవి ఆమెకు ఓ పరీక్ష పెట్టిందట. అజ్ఞాతవాసంలోకి వెళ్లే పాండవులకు అక్కడ అన్ని వసతులు, వనరులు ఉండకపోవచ్చు. ఆ సమయంలో వారి ఆకలి తీర్చడం కష్టసాధ్యమే. ఉన్న దాంట్లోనే అన్నీ సమకూర్చి పాండవుల ఆకలిని ద్రౌపది ఎలా తీరుస్తుందో చూడాలనుకుంది కుంతీదేవి. అందుకే కొంచెం గోధుమ పిండి, తక్కువ మొత్తంలో కూరగాయలు ఇచ్చి వంట చేయమని చెప్పిందట. దీంతో ద్రౌపది గోధుమ పిండితో చిన్న చిన్న పూరీలు, స్వచ్ఛమైన నదీ జలంలో కొన్ని పదార్థాలు వేసి ఘాటు రుచి వచ్చేలా చేసి గోల్‌గప్పా తయారు చేసిందట.