నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం - ఏ క్షణమైనా ఎంపీ అభ్యర్థుల జాబితా! Telangana Congress MP Candidates 2024 :రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల బరిలో దిగే అభ్యర్ధులను అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ప్రకటిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మేరకు ఇవాళ దిల్లీలోకాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (Congress Screening Committee Meeting) సమావేశం కానుంది. మొత్తం 17 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్ధుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి తుదినిర్ణయం తీసుకుంటుంది.
ఇప్పటికే రాష్ట్రంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు సమావేశమై అభ్యర్ధులకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశాయి. స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేసిన తరువాత సిద్ధమైన జాబితాతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ దిల్లీలో మకాం వేశారు. మరోవైపు టికెట్లు ఆశిస్తున్న నాయకులు సైతం రెండు రోజులుగా దిల్లీలోనే ఉంటూ పార్టీ పెద్దలను కలుస్తూ లాబీయింగ్ చేసుకుంటున్నారు.
రేపే కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా - ఆశావహుల్లో ఉత్కంఠ
ఇవాళ దిల్లీలో జరగనున్న సీఈసీ సమావేశానికి రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సీఈసీ, స్క్రీనింగ్ కమిటీలు వడపోసిన జాబితాలతో పాటు పార్టీ స్థితిగతులపై కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం సర్వేలు నిర్వహించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటికి ఉన్న పార్టీ స్థితిగతుల కంటే మరింత మెరుగైనట్లు సర్వేలో వెల్లడైంది.
అది కూడా రాష్ట్రంలోని 12 లోకసభ నియోజకవర్గాల్లోనే బలోపేతమైనట్లు తేలింది. మిగిలిన చోట్ల కూడా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగలేదని తెలుస్తోంది. అయితే స్క్రీనింగ్ కమిటీ నియోజకవర్గానికి ఒకరిద్దరు అభ్యర్ధులపై సర్వేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల బయట నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులపై కూడా సర్వేలు నిర్వహించినట్లు సమాచారం.
Congress MP Candidates List in Telangana 2024 :సీఈసీ తుది నిర్ణయం తీసుకునే ముందు కొందరు ఆశావహుల పట్ల స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రధానంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరగడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. అలాగే నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేయడంపై కూడా కొందరు నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మల్కాజిగిరి నుంచి ఇటీవలె కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని బరిలో దించేందుకు ఆశించినా సానుకూల వాతావరణం లేదని తెలుస్తోంది. ఈ రెండు కమిటీలు సమావేశమై నియోజకవర్గాల వారీగా ఇద్దరు, ముగ్గురిని ప్రతిపాదించిన నాయకులపై కూడా సర్వేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత సీఎం రేవంత్ కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. నామినేటెడ్ పదవుల భర్తీ, ఇంకా నింపాల్సిన వాటి గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను కలిసి ఎదుర్కోవాలని రైతులకు సీఎం పిలుపు
నేను గదిలో ప్రధానికి వినతిపత్రం ఇవ్వలేదు - నిండు సభలో అడిగాను : సీఎం రేవంత్