టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్స్ పెట్టి అడ్డుకున్న పోలీసులు - బై బై జగన్ అంటూ ఆందోళన TDP Leaders Protest: సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద బై బై జగన్ అంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్స్ పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలు బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, నందమూరి బాలకృష్ణ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
సభకు వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బారికేడ్లను తోసుకుంటూ ప్లకార్డులు చేత పట్టుకుని కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. జాబ్ క్యాలెండర్ విడుదల, పోలవరం పూర్తి ఎక్కడా అంటూ నినాదాలు చేశారు.
పనైపోయిన వైసీపీ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడటానికి ఏముంటుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నాడని, అందుకే పోలీసుల సాయంతో తమని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సాంప్రదాయానికి వైసీపీ శ్రీకారం చుట్టిందని బాలకృష్ణ విమర్శించారు.
జగన్ అర్జునుడు కాదు, భస్మాసురుడు: అచ్చెన్నాయుడు
TDP Leaders Tribute to Nandamuri Taraka Rama Rao: అంతకుముందు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. డీఎస్సీ విషయంలో 5 ఏళ్లుగా జగన్ తమని మోసం చేశాడని ఎమ్మెల్యే బాలకృష్ణకు అభ్యర్థులు వినతులు అందచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పక న్యాయం చేస్తుందని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలా ఒక స్థానానికి ఉదయం ఒకరిని, రాత్రికి మరొకరిని మార్చే చిల్లర పార్టీలు తెలుగుదేశం - జనసేనలు కావని నేతలు స్పష్టం చేశారు.
తెలుగుదేశం - జనసేన పొత్తులు సహృద్భావ వాతావరణంలో జరిగాయని తెలిపారు. 8వ తేదీన ఇద్దరు అధినేతలు మరోసారి సమావేశమై పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మద్యనిషేధం హామీ అమలు చేయనందుకు చివరి అసెంబ్లీ సమావేశాల్లో అయినా జగన్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ ఒక అబద్ధాలకోరని నేతలు మండిపడ్డారు. మూడు రోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. జగన్ ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారని ఎద్దేవాచేశారు.
పులివెందులలో గెలుపుపై జగన్ నమ్మకం కోల్పోయాడు కాబట్టే అక్కడ కూడా నేతలకు కోట్లాది రూపాయలు పంచుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా కూడా జగన్కు ఇవే చివరి సమావేశాలని నేతలు వ్యాఖ్యానించారు. మూడు రోజులపాటు జరగనున్న సమావేశాల్లో ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
డీఎస్పీల బదిలీలు అందుకే - లక్షీశపై మాకు నమ్మకం లేదు : సీఈసీకి అచ్చెన్న లేఖ