TDP Leaders Fire On Ys Jagan Mohan Reddy : ఆస్తి పంపకాల వ్యవహారంలో సొంత తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లి, చెల్లికే న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడని జగన్‌పై ముప్పేట దాడి చేశారు. తల్లి, చెల్లిని బజారున పడేసిన అనైతిక చరిత్ర జగన్ రెడ్డిదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. భారత కుటుంబ వ్యవస్థను ప్రపంచం అంతా గౌరవిస్తుంటే, ఆ విలువలకు తిలోదకాలిచ్చిన మహానీయుడు జగన్ అని మండిపడ్డారు.
ధన దాహంతో కుటుంబ వ్యవస్థనే జగన్ రెడ్డి అగౌరవపరుస్తున్నాడని విమర్శించారు. తల్లి, చెల్లిని వీధికి లాగి ఆస్తికోసం వెంపర్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ రెడ్డిని చూసి విజయమ్మ ప్రాణ భయంతో పారిపోయిందని ప్రజలనుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలి వర్ల రామయ్య తెలిపారు.
వైఎస్సార్ స్థాపించిన వ్యాపారాలు జగన్ సొంతం కాదు: షర్మిల
తల్లి, చెల్లికి న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని మంత్రి పార్థసారథి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ తమను మోసగించారని కుటుంబసభ్యులే వాపోతున్నారన్న ఆయన కోర్టుకు ఈడ్చడం ద్వారా విజయమ్మను మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ తప్పుబట్టారు. జగన్ పాలనలో ప్రజల ఆస్తుల విలువలు దిగజారాయన్న పార్థసారథి, జనానికి లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే జగన్ పనిగా పెట్టుకున్నారని పార్థసారథి ఆక్షేపించారు. చంద్రబాబు దార్శనికత వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్న మంత్రి పార్థసారథి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు.
ఎవరి సొమ్ము ఎవరు పంచుకుంటారు? ప్రకృతి సంపద వైఎస్ కుటుంబ ఆస్తా?
ఆస్తి కోసం తల్లి, చెల్లినే జగన్ బెదిరించడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు. తల్లి, చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెళ్లడం జగన్ క్రూర మనస్తత్వానికి నిదర్శనమన్నారు. జగన్ అనుభవిస్తున్న ఆస్తి ప్రజలదేనని అందులో కనీసం మూడో వంతు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సరస్వతి పవర్‌కు కేటాయించిన ప్రభుత్వ భూమి లీజును అడ్డగోలుగా పొడిగించుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ల పాటు పరిశ్రమ ప్రారంభించలేదని గుర్తు చేశారు. చట్ట వ్యతిరేకంగా చేసిన భూకేటాయింపులు, లీజులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తల్లి, చెల్లిని రోడ్డుపైకి లాగారు - జగన్‌లాంటి వ్యక్తులతో రాజకీయాలు చేస్తాననుకోలేదు: చంద్రబాబు