పార్లమెంట్లో యువగళం - యువతకు ప్రాధాన్యమిచ్చిన తెలుగుదేశం TDP prioritized Seats To Youth: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ యువతకు ప్రాధాన్యమిచ్చింది. రాబోయే 20 నుంచి 30 ఏళ్లపాటు పార్టీకి భుజం కాసే నాయకత్వాన్ని, తీర్చిదిద్దే లక్ష్యంతో అభ్యర్థుల కూర్పు జరిగింది. అభ్యర్థుల్లో అత్యధికులు ఉన్నత విద్యావంతులు, వారి వారి రంగాల్లో నిష్ణాతులు కావడం విశేషం.
8 మంది 50 ఏళ్ల లోపువారే: ఈసారి ఎన్నికల్లో యువతకు ప్రాథాన్యం ఇస్తామన్న చంద్రబాబు తెలుగుదేశం లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో అదే సూత్రాన్ని పాటించారు. 13 మంది అభ్యర్థుల్ని ప్రకటించగా అందులో 8 మంది 50 ఏళ్ల లోపువారే ! వారిలో ఇద్దరు 35 సంవత్సరాల లోపువారే ! ఇందులోనూ డిగ్రీ కంటే తక్కువ విద్యార్హత కలిగినవారెవరూ లేరు. బాపట్ల బరిలో దిగుతున్న, విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ వరంగల్ నిట్‌లో బీటెక్, అహ్మదాబాద్ IIMలో ఎంబీఏ చేశారు.
ప్రవాసాంధ్రుడికి అవకాశం: ఇక చిత్తూరు లోక్‌సభ సీటు దక్కించుకున్న దగ్గుమళ్ల ప్రసాద్‌రావు ఐఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి పసుపు జెండా పట్టారు. టీడీపీ అభ్యర్థుల్లో, ఇద్దరు వైద్యులున్నారు. గుంటూరు లోక్‌సభ స్థానంలో పోటీ చేయనున్న పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో ఎండీ చదివి, అక్కడే వైద్యుడిగా పనిచేశారు. గుంటూరులో రెండుసార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్, రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో, ప్రవాసాంధ్రుడు పెమ్మసానికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్: ఇక నంద్యాల ఎంపీ టికెట్ దక్కించుకున్న బైరెడ్డి శబరి ఎండీ చదవి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. విశాఖ నుంచి పోటీ చేసే భరత్ అమెరికాలో ఎంబీఏ చేయగా, నరసరావుపేట అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్ చదివారు. హ్యాట్రిక్ కొడతానుంటున్న, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు బీటెక్, విజయవాడలో పోటీకి సై అంటన్న కేశినేని చిన్ని బీటెక్ చేశారు.
మరింత పెరుగనున్న యవదళం సంఖ్య: పెరుగనుంది కర్నూలు లోక్‌సభ టికెట్ దక్కించుకున్న బస్తిపాటినాగరాజు ఎంఎస్పీ, ఎంఈడీ చేసి కొన్నాళ్లు లెక్చరర్‌గా పనిచేశారు. అమలాపురం రేసులో ఉన్న హరీష్ మాథుర్ బీబీఎం చేశారు. ఏలూరు అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు. మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ కూడా వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. హిందూపురం అభ్యర్థి పార్థసారథి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి డిగ్రీ చదివారు. టీడీపీ ఒంగోలు టిక్కెట్‌ను మాగుంట రాఘవరెడ్డికి, అనంతపురం టిక్కెట్ జేసీ పవన్‌కు కేటాయిస్తే లోక్‌సభకు పోటీ చేస్తున్న యువదళం సంఖ్య మరింత పెరుగనుంది.!
కారుకు టాటా చెప్పిన కేకే - కేసీఆర్‌కు షాక్ - BRS MP KK Likely To Join Congress
మళ్లీ ఎన్నికల బరిలో: టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల్లో ఈసారి అతి సామాన్యులు, పెద్దగా రాజకీయ నేపథ్యం లేనివారు పలువురున్నారు. బస్తిపాటి నాగరాజు సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చి గతంలో ఒకసారి ఎంపీటీసీగా గెలిచారు. గంటి హరీష్ మాథుర్ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన బాలయోగి కుమారుడే అయినా, తండ్రి మరణించాక వారి కుటుంబం చాన్నాళ్లు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంది. బాలయోగిపై ప్రజల్లో ఉన్న అభిమానం, పార్టీకి ఆయన చేసిన సేవల్ని గుర్తుంచుకుని, గత ఎన్నికల్లో హరీష్‌కు వెతికిమరీ టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడినా, ఆయనకు నైతిక స్థైర్యాన్నిస్తూ ఇప్పుడు మళ్లీ ఎన్నికల బరిలో దించింది.
అఖిల భారత సర్వీస్: 33 ఏళ్ల వయసున్న మాథుర్ టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడు. బైరెడ్డి శబరి తండ్రి రాజశేఖర్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ, కొన్నేళ్లుగా ఆయన ఏ పదవిలోనూ లేరు. పదేళ్లుగా రాయలసీమ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. డాక్టరుగా, సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారిణిగా పనిచేస్తున్న శబరిని టీడీపీ అనూహ్యంగా నంద్యాల బరిలో దించింది. తెన్నేటి కృష్ణ ప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాద్‌రావు అఖిల భారత సర్వీసుల అధికారులుగా పనిచేసినా రాజకీయాల్లో సామన్యుల కిందే లెక్క.
13 ఎంపీ, 11 అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - TDP Candidates Third List