TDP Chandrababu Raa Kadali Ra Public Meeting: జగన్ అభిమన్యుడు కాదు, అర్జునుడు కాదు, భస్మాసురుడని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా కనపర్తిపాడులోని వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన "రా-కదలిరా" సభలో మాట్లాడిన ఆయన భస్మాసుర వధ చేసే బాధ్యత ఐదు కోట్ల మంది ప్రజలదని వ్యాఖ్యానించారు.
ప్రారంభమైన జగన్ పతనం:జగన్ పతనం ప్రారంభమైందని, దేవుడు కూడా ఆయనను కాపాడలేరని టీడీపీ చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ వల్ల బాధితులైన ప్రతి ఒక్క వ్యక్తి స్టార్ క్యాంపెయినరే అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 5 కోట్ల మంది స్టార్ క్యాంపెయినర్లుగా మారి వైఎస్సార్సీపీను భూస్థాపితం చేసేందుకు ప్రజలు శపథం చేయాలని సూచించారు. పేదలకు సేవ చేసే గుణగణాలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు లేవని, బూతుల రత్నకు ఎమ్మెల్యే, బూతుల సామ్రాట్‌కు ఎంపీ, బూతుల నట సామ్రాట్‌కు మంత్రి పదవులు ఇస్తారన్నారు.
దేశంలో ధనిక సీఎం జగన్: దేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే జగన్ వద్దే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. సీఎంల ఆస్తుల్లో అగ్రస్థానంలో ఉన్నా జగన్ మాత్రం పేదబిడ్డ అని చెప్పుకుంటున్నారన్నారు. రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ ముందుందన్నారు. ఆక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటానన్న చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో తనకు తోడుగా ప్రజలుండాలని కోరారు.
కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం - జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: చంద్రబాబు
బిహార్‌ను వెనక్కి నెట్టి నిరుద్యోగంలో అగ్రస్థానంలో ఏపీ:నిరుద్యోగంలో 24 శాతంతో ఏపీ అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలతో పాటు, నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి చెల్లిస్తామన్నారు. జగన్‌ను ఓడించేందుకు ప్రతి నిరుద్యోగి స్టార్ క్యాంపెయినర్‌గా మారాలన్నారు. దీంతోపాటు స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులను వైఎస్సార్సీపీ సర్కార్ కొట్టేసిందన్న ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చి గౌరవిస్తామన్నారు.