Rayadurgam YSRCP MLA Kapu Ramachandra Reddy Join In BJP :రాష్ట్రంలో వైఎస్సార్సీపీ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఆంధ్రుడు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజాహిత పాలన అందించే మహాకూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజాహిత పాలన ఇచ్చే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ మహాకూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన భార్య భారతితో కలిసి కమలం కండువా కప్పుకున్నారు. తణుకు మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ముళ్లపూడి రేణుక, డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ దంపతులు, అమరావతి బోట్ క్లబ్ సీఈఓ తరుణ్ కాకానిలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే సమక్షంలో పార్టీలో చేరారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి పురందేశ్వరి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
మోదీ పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శం: దగ్గుబాటి పురందేశ్వరి
ప్రధాని నరేంద్రమోదీ సుపరిపాలన, అవినీతిరహిత పాలన, దృఢమైన నిర్ణయాలు వంటి వాటికి ఆకర్షితులై ఎన్నికల సమయంలో చేరికలు జరుగుతున్నాయని పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ బలపడాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీకి తమ సంఘీభావం తెలిపేందుకు వస్తున్నారన్నారు. 2019 నుంచి రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోందని విమర్శించారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసునని, అవినీతి పెట్రేగిపోయిందని, విధ్వంసకర నిర్ణయంగా ప్రజావేదిక కూల్చివేతతోనే పాలన ప్రారంభించారని మండిపడ్డారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా మూడు రాజధానుల నిర్ణయం చేశారని ఆరోపించారు. ఏ వర్గంలోని వారికి అధికారంలోని రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని, అందుకే ప్రజలంతా మార్పును ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.