ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

భూమి ఆక్రమిస్తే స్వాధీనం చేసుకోండి - విచారణకు వెళ్లే ప్రసక్తే లేదు: అమర్నాథ్​ రెడ్డి - AMARNATH REDDY LAND ENCROACHMENTS

రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వందల ఎకరాలు కొల్లగొట్టారనే ఆరోపణలు - ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశం - విచారణకు వెళ్లే ప్రసక్తే లేదన్న ఆకేపాటి

AMARNATH REDDY
AMARNATH REDDY (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2025, 10:11 AM IST

Updated : Feb 22, 2025, 1:42 PM IST

MLA Amarnath Reddy Land Encroachments: అన్నమయ్య జిల్లా రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. తన కుటుంబసభ్యులు, బినామీల పేరిట భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. నేడు రాయచోటిలోని జాయింట్ కలెక్టర్ ఎదుట ఆకేపాటి కుటుంబ సభ్యులు విచారణకు హాజరు కానున్నారు. తన అనుచరుల ఆక్రమణలు కూల్చి వేస్తుండటంతో కలెక్టర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆకేపాటి ఆరోపణలు చేయడం విమర్శలకు తావిస్తోంది.

ముందుగా ప్రభుత్వ భూములను వారి పేరిట రాయించి:అన్నమయ్య జిల్లా ఆకేపాడు, మందపల్లి రెవెన్యూ గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని వైఎస్సార్సీపీ హయాంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన కుటుంబసభ్యుల పేరుతో కాజేసేందుకు ప్రయత్నాలు చేశారనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. ముందుగా ప్రభుత్వ భూములను ఎస్సీ, ఎస్టీల పేరిట రాయించి, ఆ తర్వాత వాటిని తన పేరిట బదలాయించుకునేవారని కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ భూముల్లో ఎస్సీ కాలనీ ఉండగా ఖాళీ చేయించి పాఠశాల నిర్మాణం చేపట్టి దాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారని చివరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పేరిట ఏకంగా టీటీడీ నిధుల ద్వారా కల్యాణ మండపం నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి.

ఆకేపాడులో సర్వే నంబరు 56/1లో ఎకరన్నర భూమిని రాయించుకున్నారని, ఇప్పుడు ఆ కల్యాణ మండపం ఉన్న భూమిని భార్య ఆకేపాటి జ్యోతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి సెటిల్మెంటు దస్తావేజు కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అభియోగాల్లో తెలిపారు. ఈ భూముల్ని ఆకేపాటి కొట్టేయడంపై పలుమార్లు ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా రాజంపేటకు చెందిన గన్నె సుబ్బనర్సయ్య ఫిర్యాదు చేయడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ విచారణకు ఆదేశించారు. గతంలో వందలాది ఎకరాల్ని తన కుటుంబసభ్యుల పేరిట రాయించుకోగా, సీసీఎల్​ఏ జోక్యం చేసుకుని రద్దు చేసింది. రద్దు సమయంలో కొన్ని సర్వే నంబర్లు తప్పిపోగా ఆ భూములకు చట్టబద్ధ హక్కులు కల్పించుకునే ఎత్తుగడలో భాగంగా ఎక్కడా లేని విధంగా తనతో పాటు భార్య, తమ్ముడు, మరదల పేరిట పరస్పరం భూముల్ని బదలాయించుకుంటూ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

కలెక్టర్ లక్ష్యంగా ఆకేపాటి ఆరోపణలు: వైఎస్సార్సీపీ హయాంలో తన అధికార దర్పాన్ని వినియోగించి 2023 మే 10న రెవెన్యూ అధికారులను దగ్గర ఉంచుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు సాగించారు. ఒకే వరుసలో డాక్యుమెంట్ల సంఖ్యలు రావడమే దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాజంపేట పరిసరాల్లో ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టగా వాటిని ఇటీవల రెవెన్యూ యంత్రాంగం కూలగొట్టి స్వాధీనం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆకేపాటి అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ భూముల్ని సొంతం చేసుకోవడం, ఎస్టేట్ నిర్మించుకోవడంపై దృష్టి సారించింది. ఈ భూములకు సంబంధించిన ఆధారాలు తీసుకుని జాయింట్ జేసీ కోర్టులో హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే జంకుతున్నారు.

ఇక తన వంతు వస్తోందని గ్రహించిన ఎమ్మెల్యే ఆకేపాటి మీడియా ముందుకు వచ్చి హెచ్చరికల ద్వారా యంత్రాంగాన్ని దారిలోకి తెచ్చుకునే కుతంత్రాలు సాగిస్తున్నారు. ఇదే భూముల్లో జడ్పీ నిధులు, నరేగా నిధులతో రహదారులు, కాలువలు, పశువుల పాకలు నిర్మించుకుని ప్రజాధనాన్ని సైతం కొలగొట్టారు. ఎమ్మెల్యే భూ ఆక్రమణలపై ఇవాళ విచారణకు రావాలని కలెక్టర్ నోటీసు ఇచ్చారు. గతంలోనే పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించిన దాఖలాలు లేవు. చివరగా ఇవాళ విచారణకు రావాలంటూ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, భార్య జ్యోతి, తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి, మరదలు సుజనకు నోటీసులు ఇచ్చారు. ఆకేపాటి అక్రమ భూ దందాపై అధికారులు నిగ్గు తేల్చాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గత పదేళ్ల నుంచి దాదాపు వంద ఎకరాలు పైగానే ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమించారని సుబ్బనర్సయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపితే మరిన్ని బాగోతాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆకేపాటి ఎస్టేట్‌లోకి ఎవ్వరిని రానీయకుండా తన అనుచరులను కాపలా పెట్టారు.

"ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, భూ బకాసురుడులా తయారవుతున్నాడని భావించి ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియజేశాము. ప్రస్తుతం ఇది కోర్డులో నడుస్తోంది. ఇప్పటి వరకూ వాళ్లు విచారణకు రాలేదు. దీనిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మేము నమ్ముతున్నాం". - సుబ్బనర్సయ్య, ఫిర్యాదుదారుడు, రాజంపేట

అమర్నాథ్​ ఏమన్నారంటే: ఇదిలావుంటే నోటీసులపై ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి స్పందించారు. కడపలో ఉయ్యాలవాడ వర్థంతి సభకు హాజరైన ఆయన ఎవరు నోటీసులు ఇచ్చినా విచారణకు వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. నా ఎస్టేట్‌లో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు ఉంటే స్వాధీనం చేసుకోవచ్చని తెలిపారు.

55 ఎకరాల సరిహద్దులు గుర్తింపు - సజ్జల ఎస్టేట్​లో కొనసాగుతున్న సర్వే

'అటవీ భూమి ఆక్రమించి చుట్టూ ఇనుప కంచె వేసి'

Last Updated : Feb 22, 2025, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details