Politicians Congratulated Advani on Bharat Ratna:ఎల్‌కే అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. అడ్వాణీ దేశం పట్ల ఆదర్శప్రాయమైన కృషి, అంకితభావం కనబరుస్తూ తనకు తాను గుర్తింపు పొందారని చంద్రబాబు కొనియాడారు. పండితుడు, రాజనీతిజ్ఞుడుగా దేశానికి అసాధారణమైన సేవలను అందించారన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. అడ్వాణీ ఆప్యాయత స్వభావం అందరికీ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు పేర్కొన్నారు.
బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి భారతరత్న- శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Janasena chief Pawan Kalyan:భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నాయకుడు మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అడ్వాణీ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. అత్యున్నతమైన ‘భారత రత్న’ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషదాయకమన్నారు. సుదీర్ఘమైన ప్రజా జీవిత అనుభవం కలిగిన అడ్వాణీకి ఈ సందర్భంగా తన తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు. మెజారిటీ భారతీయుల మనోభావాలకు ప్రతీకగా నిలిచి, ధృడ చిత్తంతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు మన దేశ రాజకీయాలను ఎంతో ప్రభావితం చేశాయన్నారు.
అడ్వాణీ పేరు వినగానే ఎవరికైనా రథ యాత్ర స్ఫురణకు వస్తుందని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చేపట్టిన రథ యాత్ర భారత రాజకీయ, పాలన వ్యవస్థల్లో కీలక మలుపును తీసుకువచ్చిందని తెలిపారు. దేశానికి హోమ్ శాఖ మంత్రిగా చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమైనవన్నారు. ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నేతగా అడ్వాణీ ప్రజా పక్షం వహించారని, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారన్నారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మితమైన వేళ అడ్వాణీని భారత రత్న పురస్కారానికి ఎంపిక చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకీ, కేంద్ర ప్రభుత్వానికీ పవన్ కల్యాణ్ అభినందనలు తెలియచేశారు.