Political Review on Eluru Parliament Constituency:ఏలూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏలూరు లోక్ సభ నియోజకవర్గం విస్తరించి ఉంది. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తుండగా 2024 ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో 16.25 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 7.94 లక్షలు, మహిళలు, 8.30 లక్షలు, ట్రాన్స్ జెండర్లు 129 మంది ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావుపై వైసీపీ అభ్యర్థి కోటగరి శ్రీధర్ గెలుపొందారు.
Eluru Lok Sabha Constituency:ప్రస్తుతం ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు కాగా ఏలూరు నుంచి బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దించాలన్న ఉద్దేశంతో టీడీపీ అధిష్టానం మహేష్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. మరోవైపు వైసీపీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్‌కు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. కాంగ్రెస్ నుంచి జంగారెడ్డిగూడెంకి చెందిన ఎన్ఆర్ఐ కావూరి లావణ్య పోటీ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఏలూరులో షర్మిల పర్యటన సందర్భంగా పార్టీలో చేరిన ఈమె అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు.
ఏలూరు ఎంపీగా గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కోటగిరి శ్రీధర్ పార్టీ శ్రేణులకు ఏనాడూ అందుబాటులో లేరు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలోనూ ఆయన చొరవ అంతంతమాత్రమే. ఈ నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యైన కొల్లేరు అభివృద్ధికి శ్రీధర్ చేపట్టిన చర్యలు శూన్యం. మరోవైపు నిర్వాసితులకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్లో గళం విప్పిన దాఖలాలూ లేవు. ఈ నేపథ్యంలో ఆయనే స్వతహాగా ఈసారి పోటీ నుంచి తప్పుకోగా ఆయన స్థానంలో వైసీపీ కారుమూరి సునీల్ కుమార్‌ను రంగంలోకి దించింది.
క్లీన్ స్వీప్ చేయాలని టీడీపీ వ్యూహాలు: ఏలూరు లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మరోసారి అదే లక్ష్యంతో అధికార పార్టీ అడుగులు వేస్తుండగా ఆ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం ద్వారా జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పాగా వేయాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.
రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకత - కూటమిదే హవా - Rajamahendravaram Constituency
Eluru Constituency:ఏలూరు నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆళ్ల నాని గతంలో జగన్ క్యాబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. అయితే ఈసారి ఆయనకు ఏలూరులో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వైసీపీ వర్గపోరు కూడా ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు ఎవరితోనూ కలవరన్న పేరు కూడా ఉంది. వైసీపీ ఇచ్చిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో అతి తక్కువగా పాల్గొన్న వారిలో నాని ఒకరు. మరోవైపు ఏలూరు నగర కార్పొరేషన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అధికార పార్టీ నేతలే విమర్శలు గుప్పించడం ప్రతిపక్షానికి ఇక్కడ బలం చేకూర్చుతోంది. మరోవైపు ఈ స్థానానికి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు సోదరుడు బడేటి రాథాకృష్ణయ్య పోటీ చేస్తుండగా కూటమిలో ఉండటం, అటు జనసేన సైతం మద్దతు ఇస్తుండటం ఈయనకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.
Dendulur Constituency:దెందులూరు బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఈ సారి కూడా పోటీలో ఉండగా నియోజకవర్గంలో అటు తండ్రి, ఇటు కుమారుడిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇసుక మాఫియా, పోలవరం గట్టు మట్టి తవ్వకాలు, కొల్లేరులో అక్రమ తవ్వకాలు, కోడిపందాలు, జూదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విమర్శలు వినిపించాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన చింతమనేని ప్రభాకర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. దూకుడు ఉన్న నాయకుడిగా పేరున్న ఈయనకు దుర్భాషలాడుతారనే చెడ్డపేరు ఉంది. అయితే అబ్బయ్య చౌదరి పట్ల ఉన్న వ్యతిరేకత, నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఈసారి మద్దతు తెలుపుతుండటంతో ఈసారి గెలుపుపై చింతమనేని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Kaikaluru Constituency:కైకలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా దూలం నాగేశ్వరరావు మరోసారి బరిలో నిలవగా కూటమి నుంచి చివరి నిమిషంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు పోటీకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపించిన వారిలో దూలం నాగేశ్వరరావు ఒకరు. తన కుమారులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే ఇక్కడ పలు దందాలకు పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు కొల్లేరు అక్రమ తవ్వకాల నుంచి ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సైతం జనాల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టినట్లుగానూ పలువురు చెబుతున్నారు. నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈసారి ఆయనకు అంతగా అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు మాజీ మంత్రిగా కైకలూరు అభివృద్ధికి కృషి చేయడం, వివాద రహితుడిగా పేరుండటం కామినేని శ్రీనివాస్‌కు కలిసొచ్చే అంశం. మరోవైపు ఈ సారి కొల్లేరు లంక గ్రామాల ప్రజలు సైతం కూటమికి మద్దతు ఇస్తుండటం చెప్పుకోదగ్గ విషయం.
విజయనగర వాసుల మొగ్గు ఎవరి వైపు? - Vizianagaram political review
Ungutur Constituency:ఉంగుటూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పేరు ఇక్కడ బలంగా వినిపించింది. అయితే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించగా ఆ పార్టీ నుంచి పత్సమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాపు, కమ్మ, బీసీ సామాజిక ఓటర్లు సమానంగా ఉండగా ఈ సారి ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే దానిపై చర్చ జరుగుతోంది. వైసీపీ అభ్యర్థి వాసుబాబు వివాద రహితుడిగా పేరున్నా నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా తాగునీటికి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించడంలో వాసుబాబు చర్యలు శూన్యం. ధర్మరాజు స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తుండటం ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తూ గ్రామాల దాహార్తి తీర్చడం ఈయనకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
Nuzividu Constituency:నియోజకవర్గాల పునర్విభజనలో ఏలూరు జిల్లాలో కలిసిన నూజివీడులో వైసీపీ నుంచి బరిలోకి దిగిన మేకా వెంకట ప్రతాప అప్పారావు రెండు సార్లు విజయం సాధించగా మరోసారీ విజయంపై పట్టుదలగా ఉన్నారు. నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో వైసీపీ బలంగా ఉన్నా గతంతో పోలిస్తే ప్రభుత్వం మీద వ్యతిరేక కనిపిస్తోంది. ఈ ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేరు ఇక్కడ బలంగా వినిపించినా చివరి నిమిషంలో వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని అభ్యర్థిగా నిలిపారు. దీంతో ఒక దశలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం చేపట్టిన ముద్దరబోయిన అధిష్టానం హామీతో చివరి నిమిషంలో విరమించుకున్నారు. మరోవైపు పార్టీలో వర్గ విభేదాలు, అభ్యర్థి మార్పు కొంత పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి.
జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేసిన చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING
Polavaram Constituency:ఎస్టీ నియోజకవర్గమైన పోలవరంలో గత ఎన్నికల్లో గెలిచిన బాలరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఆయన పనితీరుపై పెద్దఎత్తున ప్రజల్లో అసంతృప్తి ఉంది. పోలవరం నిర్వాసితుల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విలీన మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో పలు గ్రామాల ప్రజలకు ఇప్పటికీ పునరావాసం చూపలేదు. కనీసం వరదల సమయంలోనూ ఆయా గ్రామాలను ఎమ్మెల్యే బాలరాజు సందర్శించి, పరామర్శించిన పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి. నిర్వాసితుల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం కూడా ఎమ్మెల్యే పట్ల అసంతృప్తికి ప్రధాన కారణం. దీంతో ఈ సారి ఈ టికెట్‌ను వైసీపీ అధిష్టానం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి ఇచ్చింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ పోలవరం ఇంఛార్జి బొరగం శ్రీనివాస్ ఇక్కడ పోటీలో ఉంటారని భావించగా పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు బరిలోకి దిగారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువగా ఉండగా జనసేనకు సీటు కేటాయించడంతో టీడీపీ క్యాడర్లో కొంత అసమ్మతి నెలకొంది. దీంతో వారు ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.
Chintalapudi Constituency:చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఉన్నమట్ల రాకాడ ఎలీజా ఎమ్మెల్యేగా ఉండగా వర్గపోరు, సొంత పార్టీ నేతలతోనే పొసగకపోవడం పార్టీ దూరం పెట్టడంతో ఇటీవల ఆయన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన స్థానంలో వైసీపీ కంభం విజయరాజును బరిలోకి దింపింది. ఇక టీడీపీ నుంచి చింతలపూడి స్థానానికి గట్టి పోటీ ఎదురైంది. మాజీ మంత్రి పీతల సుజాత, ఎన్ఆర్ఐలు అనీల్, సొంగా రోషన్ కుమార్ ఈ స్థానానికి పోటీ ఇవ్వగా అధిష్టానం సొంగా రోషన్ కుమార్‌కు అవకాశం కల్పించింది.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి తీవ్ర వ్యతిరేకత (ఈటీవీ భారత్)