Pavan Silent revolution : కొన్నిసార్లు రావడం లేటు అవ్వొచ్చేమో గానీ, రావడం పక్కా అనే పవన్ కల్యాణ్ డైలాగ్ రాజకీయాల్లోనూ నిరూపితమైంది. అధ్యక్షా అని పిలవడానికి పవన్ పదేళ్లు ప్రజా క్షేత్రంలో ఓ యుద్ధమే చేశారు. ఆయన శక్తి, సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు కాబట్టే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్‌ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో అవమానించారు. హృదయం ముక్కలయ్యే మాటలతో దత్తపుత్రుడంటూ హేళన చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ముఖ్యమంత్రి నుంచి మాజీ మంత్రుల వరకూ ప్రతిఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేశారు. కానీ, పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలైపోయాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించడంతో రాష్ట్ర మంత్రిగా ప్రజల రుణం తీర్చుకొనేందుకు పవన్ సిద్ధమయ్యారు.
సూట్ కేసులతో డబ్బులు పట్టుకొని ఇంటిముందు నిలబడే నిర్మాతలు, సకల సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం, విదేశీ ప్రయాణాలు.. అవేమీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. ‘తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలన్న తపనతో ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయం పులి మీద స్వారీ లాంటిది, వెనుదిరిగి చూడకూడదు, నేరుగా ఆ రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొనే నవ్యాంధ్రప్రదేశ్‌కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలని పవన్ గుర్తించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మద్దతు పలికి . ఎన్డీయేతో మైత్రీని కొనసాగించారు.
జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్ - Janasena Party Legislature Leader
కాలచక్రంలో ఐదేళ్లు గిర్రున తిరిగాయి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నిజం. 2014లో టీడీపీకి మద్దతు పలికిన పవన్‌కల్యాణ్.. 2019కి వచ్చేసరికి సైద్ధాంతిక విభేదాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. తాను ఢీకొనేది రెండు (టీడీపీ, వైఎస్సార్సీపీ) బలమైన శక్తులని తెలుసీ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగి ఓటమి పాలయ్యారు. ఆ పరిస్థితుల్లో వేరొకరైతే పార్టీని వదిలించుకునేందుకు చూసేవారు. కానీ పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా పవన్ మనో నిబ్బరం నింపాడు. పార్టీ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి దూరమైనా అధైర్యపడకుండా ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు.
జనసైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్ దిశా నిర్దేశం చేశారు. ప్రజాభీష్టం మేరకు భారీ మెజార్టీతో గెలిచిన వైఎస్సార్సీపీ పాలనపై వేచి చూసే ధోరణితో రాజకీయ విజ్ఞత ప్రదర్శించారు. దాదాపు ఏడాది పాటు ప్రభుత్వంపై పెద్దగా విమర్శల జోలికి పోలేదు. కానీ, అధికారం మత్తు తలకెక్కిన వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో ఆగ్రహించారు. ప్రశ్నించిన జన సైనికులపై ప్రభుత్వం దాడులకు తెగబడడంతో జనసేనాని స్వయంగా రంగంలోకి దిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. పార్టీ నడపాలంటే డబ్బులు కావాలన్న ఆలోచనలతో తాను వద్దనుకున్న సినిమాలను మళ్లీ చేశారు. ఆయన చిత్రాలకు ఏపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా తట్టుకుని నిలబడ్డారు. జనసైనికుల్లో ఉత్సాహాన్ని ఓ ప్రజాపోరాటానికి ఇంధనంగా మార్చడంలో విజయవంతమయ్యారు. ‘సీఎం.. సీఎం’ అని అభిమానులు నినదిస్తుంటే.. ‘ముందు నన్ను గెలిపించండి..’ అంటూ వినమ్రంగా అడగగలిగిన రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమే.