Political War in Warangal MP Seat :వరంగల్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ వీడటంతో లోక్‌సభ ఎన్నికల సమరం (Lok Sabha Election 2024) ఓరుగల్లులో రసవత్తరంగా మారుతోంది. హనుమకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ మారెపల్లి సుధీర్ కుమార్‌ను పార్టీ అభ్యర్ధిగా బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం వరంగల్ పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ అందరితో చర్చించి ఆయనను అభ్యర్థిగా నిర్ణయించారు. వరంగల్ పార్లమెంట్ ( Warangal MP seat )నియోజకవర్గంలో గెలుపు అవకాశాలున్నాయని సమష్టిగా సాగి, పార్టీని గెలుపు తీరాలకు చేర్చాలని గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు.
Lok Sabha Elections 2024 :హనుమకొండలోనే పుట్టి వైద్య విద్యను అభ్యసించి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఎండీ చేసిన సుధీర్ కుమార్ బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా నిలిచారు. పార్టీ కార్యక్రమాల్లో ఆదినుంచి విస్తృతంగా పాల్గొన్న ఆయన ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర గళం వినిపించారు. పార్టీ పట్ల, కేసీఆర్‌పైన అత్యంత విధేయంగా ఉండే ఆయన వరంగల్ ప్రజలు తనకు చారిత్రాత్రకమైన విజయం అందిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిపై చివరకు సస్పెన్షన్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందరికన్నా ముందే కడియం కావ్య(Kadiyam Kavya)ను అభ్యర్థిగా నిర్ణయిస్తూ గులాబీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే మారిన రాజకీయ పరిస్ధితులతో కావ్య ఆ పార్టీ తరఫున పోటీ చేయలేనంటూ ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. కడియం శ్రీహరి, కావ్యలిద్దరూ భారత్ రాష్ట్ర సమితిని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అధికారికంగా ప్రకటించిన అభ్యర్ధే పోటీ చేయలేనంటూ వైదొలగడం వెళ్తూ వెళ్తూ విమర్శలు గుప్పించటంతో కారు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
కావ్య వద్దనుకున్న స్థానంలో బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. తమ పేర్లు కూడా పరిశీలించాలంటూ మరికొందరు జిల్లా నాయకులు వినతులు ఇచ్చారు. ఆచితూచి వ్యవహరించిన గులాబీ పార్టీ నాయకత్వం చివరకు సుధీర్ కుమార్ వైపు మొగ్గు చూపింది.