Capital Amaravati Development Works: పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికేసిందట ఇది పాత సామెత. అసమర్థుడికి అధికారం ఇస్తే అభివృద్ధిని ఆమడ దూరంలో పెట్టారు. రాష్ట్రంలో జగన్ జమానా చూశాక పుట్టుకొచ్చిన కొత్త సామెత ఇది. సామెత మాత్రమే కాదు ఇది పచ్చి నిజం కూడా. రాజధాని అమరావతిలో అడుగడుగునా జరిగిన విధ్వంసమే అందుకు నిదర్శనం. అభివృద్ధి చేయడం మాట అటుంచి ఉన్నదానిని నాశనం చేయడం, వీలైనంత పనికిరాకుండా చేయాలన్న కక్షను ప్రదర్శించారు జగన్.
ఇవన్నీ గ్రహించిన జనం జగన్‌ను గద్దె దించారు. అయితే ఇప్పుడు జగన్ చేసిన విధ్వంసం నుంచి అమరావతిని కోలుకునేలా చేయడం, పునర్ నిర్మాణం.. కూటమి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. గతంలో ఆగిన నిర్మాణాల ప్రారంభం, ముందుగా చేయాల్సిన పనులు, నిర్మాణాల సామర్థ్యం ఇలా అన్నీ సందేహాలే. అందుకే ఐఐటి నిపుణులతో అధ్యయనం చేయిస్తోంది. వారి నివేదిక ఆధారంగా అమరావతి పనులు ప్రారంభానికి సర్కారు సమాయత్తమైంది.
అడవులను తలపిస్తున్న భూములు, తటాకాల్లా మారిన ఐకానిక్ టవర్స్ పునాదులు, మొండిగోడలతో కనిపిస్తున్న కీలక భవనాలు. ఇవీ రాజధాని అమరావతిలో పరిస్థితులు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యానికి ఉదాహరణలు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 40వేల కోట్ల రూపాయలతో నిర్మాణాల పనులకు ఇక్కడ టెండర్లు పిలిచి పనులు చేపట్టారు. 9వేల కోట్ల రూపాయలు వ్యయం చేశారు. రాజధానికి అవసరమైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, సచివాలయం, ఇతర పరిపాలనా భవనాలు, ప్రజాప్రతిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలను నిర్మించారు.
ఏపీలో ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం: పెమ్మసాని - Pemmasani on Union Budge
పనులు వివిధ దశల్లో ఉండగా ప్రభుత్వం మారింది. అమరావతిపై అకారణంగా విద్వేషం పెంచుకున్న అప్పటి సీఎం జగన్ ఈ పనుల్ని పక్కన పెట్టారు. రాజధానిని నాశనం చేసేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. ముంపు ప్రాంతమని ఒకసారి, శ్మశానం అని మరోసారి, అవినీతి జరిగిందని, అసైన్డ్ భూములని, అనవసరపు ఖర్చని, అదేదో ఒక కులానికి సంబంధించిందని ఇలా చాలా తప్పుడు మాటలు మాట్లాడారు. విషప్రచారాలు చేశారు. అక్కడి భవనాలు, నిర్మాణసామాగ్రిని అలాగే వదిలేశారు.
అమరావతిలో సీఎం కార్యాలయం, సచివాలయం కోసం నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల పిల్లర్లు జగన్ నిర్వాకంతో ఐదేళ్లుగా పునాదుల్లోనే మగ్గిపోయాయి. ఈ భవనాల పునాదులు పటిష్టంగా ఉండడానికి అప్పట్లో ప్రత్యేకమైన పరిజ్ఞానం ఉపయోగించారు. 10మీటర్లకు పైగా లోతు నుంచి పిల్లర్లు నిర్మించారు. అలాగే నివాస సముదాయాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇలాంటి బహుళ అంతస్థుల భవనాలు ఐదేళ్లుగా మౌనంగా రోదించాయి.
చాలాచోట్ల వైఎస్సార్సీపీ నేతలు రహదారులను తవ్వేశారు. కంకర అమ్ముకున్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ విధ్వంసానికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పనులు మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. గతంలో జరిగిన పనుల్ని నిపుణులతో పరిశీలించి సాంకేతిక సామర్థ్యం, పటిష్టతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు చెన్నై, హైదరాబాద్ ఐఐటి నిపుణులను అమరావతికి ఆహ్వానించారు.
శుక్రవారం హైదరాబాద్ ఐఐటీ నిపుణులు నిర్మాణాలను పరిశీలించగా, కొన్ని రోజుల తర్వాత ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం రానుంది. అన్నీ పరిశీలించి వీరు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. సచివాలయం టవర్ల పునాదుల కోసం వెయ్యి మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతున భారీ గోతులు తవ్వి, వాటిలో 4 మీటర్ల మందంతో కాంక్రీట్ పునాదులు నిర్మించారు. హైకోర్టు భవనం పునాదుల కోసం 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతున భారీ గొయ్యి తవ్వి నిర్మాణ పనులు చేపట్టారు.
అమరావతిలో నిర్మాణాలు ఎలా ఉన్నాయి? - అధ్యయనానికి సాంకేతిక కమిటీ నియామకం - Committee on capital region
ఈ పునాదుల గోతుల్లో కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ నీటిని తోడి, ఎప్పటికప్పుడు ఊరే నీటినీ ఎత్తిపోయాలి. పునాదుల్లోకి అంచుల నుంచి విరిగిపడిన మట్టిని, బురదను తొలగించడం కూడా శ్రమతో కూడిన వ్యవహారం. ఇవన్నీ పూర్తి చేయటంతో పాటు ఐఐటీ నిపుణుల నివేదిక ప్రకారం నిర్మాణాలు మొదలుపెట్టాల్సి ఉంది. అమరావతిలో నిర్మాణ పనులు చేపట్టాలంటే ప్రస్తుతం ఉన్న అడ్డంకులను అధిగమించాలి.
ఏదైనా నిర్మాణం ప్రారంభించాలంటే అక్కడ అనువైన వాతావరణం, భౌగోళిక పరిస్థితులు ఉండాలి. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మించాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల నుంచి 34వేల ఎకరాలను భూ సమీకరణ ద్వారా తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించింది. ఐతే పనులు జరిగిన చోట ఐదేళ్ల జగన్ పాలనలో నిర్మాణాలు విధ్వంసానికి గురైతే, పనులు చేపట్టని ప్రాంతాలన్నీ అడవిగా మారిపోయాయి.
కంపచెట్లు, పిచ్చిచెట్లతో ఎటుచూసినా అమరావతి చిట్టడవిని తలపిస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాగానే సీఆర్డీఏ అధికారులు మొదట కంప చెట్లను తొలగించే పనులు ప్రారంభించారు. రాజధాని సీడ్ యాక్సిస్ రహదారితో పాటు మరికొన్ని రహదారుల వెంట పెరిగిన కంపచెట్లను తొలగించారు. ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాల్సి ఉంది. దీనికోసమే 40కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో కంపచెట్లు తొలగించి అక్కడకు చేరుకునేందుకు రహదారులు నిర్మించాల్సి ఉంది. అలాగే ఇతర భూముల్లోనూ జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలి.
అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తైతేనే అక్కడ కంపెనీలు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు వచ్చినా భూములు చూపించేందుకు వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం తమ కార్యాలయాలతో పాటు గతంలో భూములు కేటాయించిన ప్రైవేటు సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి. కేంద్రం అమరావతి కోసం 15వేల కోట్ల రూపాయలను రుణాల రూపంలో సాయం చేసేందుకు ముందుకొచ్చింది.
దీంతో అమరావతికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. 25వేల కోట్ల రూపాయలతో అమరావతి చుట్టూ రింగు రోడ్డు నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించింది. ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలో ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేందుకు అనుకూల అంశాలు. ఐతే ఇవి జరగాలంటే ముందు అమరావతిని పరిశుభ్రంగా మార్చి మౌలిక వసతులు కల్పించాలి. జగన్ చేసిన విధ్వంసం వల్లే అమరావతిని తిరిగి నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు విమర్శిస్తున్నారు.
రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. అలాగే అనుసంధాన రహదారుల నిర్మాణం కూడా చేపట్టాలి. గతంలో భూ సమీకరణకు ఇబ్బందులు ఏర్పడిన కారణంగా సీడ్ యాక్సిస్ రహదారి వెంకటపాలెం వద్ద ఆగిపోయింది. ఇప్పుడు రైతులతో మాట్లాడి రహదారి పనుల్ని పూర్తి చేయనున్నారు. ఈ రహదారిని తాడేపల్లి వద్ద జాతీయ రహదారితో కలపాల్సి ఉంటుంది. అప్పుడు అమరావతికి విజయవాడ నుంచి రాకపోకలు సులువవుతాయి.
రాజధాని పరిధిలో సీడ్ యాక్సిస్ రహదారికి మిగతా ప్రాంతాలను అనుసంధానిస్తూ మరికొన్ని రహదారులున్నాయి. అవన్నీ జగన్ హయాంలో వివిధ దశల్లో ఆగిపోయాయి. ఆ పనులు చేపడితే రాజధాని పరిధిలో రాకపోకలు సజావుగా సాగుతాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఇతర నిర్మాణాలు జరగాలి.అమరావతిమాస్టర్ ప్లాన్‌లో నవనగరాలను పొందుపర్చారు. వాటిని దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం ఎన్నో కుట్రలు పన్నింది.
అమరావతి కార్పొరేషన్, అమరావతి మున్సిపాలిటీ అంటూ ప్రయత్నాలు చేసింది. ఐతే గ్రామసభల్లో రైతులు వ్యతిరేకించటంతో జగన్ ఆటలు సాగలేదు. దీంతో మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలతో పాటు కొన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా మార్చింది. ఇది కూడా అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విఘాతం కలిగించే చర్యే. పేదల ఇళ్ల స్థలాల కోసమని ఆర్ 5 జోన్ పేరిట భారీ కుట్ర చేసింది జగన్ ప్రభుత్వం. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో నివసించే వారికి రాజధానిలోకి కీలకమైన ప్రాంతాల్లో ఒక్కొక్కరికి ఒక సెంటు భూమిని కేటాయించింది.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ చిక్కుముడిని చాలా జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంది. దీనికోసం న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. అలాగే మూడు రాజధానులకు సంబంధించిన కేసులు కూడా సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. ఆ పిటిషన్లను వెనక్కు తీసుకోవటం, రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా చూడడం కూడా సర్కారు ముందున్న మరో సవాల్. అందుకే ప్రభుత్వం అమరావతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.
అమరావతికి అవసరమైన నీటి వసతి కల్పించటం కోసం చేపట్టిన వైకుంఠపురం ఎత్తిపోతల పథకాన్ని జగన్ ప్రభుత్వం నిలిపివేసింది. రాజధానిలో ముంపు సమస్య లేకుండా చేపట్టిన కొండవీటి వాగు, పాలవాగుల అభివృద్ధి పనుల పరిస్థితి కూడా అదే. వీటిని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించాల్సి ఉంది. రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధుల సేకరణ కూడా ప్రభుత్వం ముందున్న సవాల్. నిర్మాణ పనులు ప్రారంభించే లోగా ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే పనిలో ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యలతో అమరావతికి ఇక మంచి రోజులు వచ్చినట్లే అని అంతా భావిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా - అమరావతికి రూ.15 వేల కోట్లు - AP Special Financial Assistance