YSRCP Leaders and AP Police officers plan Failed: అడ్డగోలుగా కేసు నమోదు చేసి, ముంబయికి చెందిన సినీనటిని అరెస్టు చేసిన వ్యవహారంలో ఏపీ పోలీసులు, నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్న ప్లాన్ బెడిసికొడుతోంది. ఏదో ఒక కేసు పెట్టి ఇరికించాలనే ఆత్రుతలో వారు తప్పటడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తన 5 ఎకరాల భూమిని సొంతం చేసుకునేందుకు బాలీవుడ్ నటి ఫోర్జరీ పత్రాన్ని సృష్టించిందని వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ (Kukkala Vidya Sagar) ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఫిర్యాదు ఇచ్చారు.
దీని ఆధారంగానే కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను ముంబయి వెళ్లి అరెస్టు చేశారు. ఆమెకి వ్యతిరేకంగా ఫోర్జరీ కేసులో సాక్ష్యాలు సృష్టించడంలో వైఎస్సార్సీపీకి సన్నిహితుడైన ఓ న్యాయవాది కీలక పాత్ర పోషించారు. పోలీసులకు ఆయనే దిశానిర్దేశం చేసినట్లు తెలిస్తోంది. ‘జగ్గయ్యపేటలో నా ఐదెకరాల పొలాన్ని నటికి అమ్మినట్లు, అందుకు రూ.50 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నట్లు 100 రూపాయల స్టాంపు పత్రంపై ఆమె నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ పత్రాన్ని చూపించి, భూమి అమ్ముతానని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన బోరుకాటి భరత్‌కుమార్, మొవ్వ మండలం కోసూరుకు చెందిన చిందా వీర వెంకట నాగేశ్వరరాజుల నుంచి అడ్వాన్సుగా 5 లక్షల రూపాయలు వసూలు చేసింది’ అని కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే అడ్వాన్సుగా డబ్బులిచ్చామంటున్న నాగేశ్వరరాజు అనే వ్యక్తి విద్యాసాగర్ తండ్రి, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వరరావుకి శిష్యుడు. గతంలో తన సొంత డబ్బులతో నాగేశ్వరరాజును కోసూరు సర్పంచిగా ఆయన గెలిపించారు. ఇక బోరుకాటి భరత్‌కుమార్ అనే వ్యక్తి నాగేశ్వరరాజు అల్లుడు కావడం గమనార్హం. విద్యాసాగర్‌కు అంత సన్నిహితులను ముంబయికి చెందిన ఆ నటి ఆశ్రయించి, భూమిని అమ్ముతానంటూ చెప్పి ఎలా అడ్వాన్సు తీసుకుందో పోలీసులకే తెలియాలి.