MLA ADINARAYANA REDDY ON VIJAYASAI REDDY: వైఎస్సార్సీపీలో ఉండలేకే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. జగన్ లాంటి నేతలను వదిలించుకోవాలని, రాజకీయాల్లోకి నేరగాళ్లను రానీయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివేకా విషయంలో విజయసాయిరెడ్డి ఇప్పటికి నిజం చెప్పారని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో తమపై అనేక ఆరోపణలు చేశారని అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో వేగం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఆరేళ్లవుతున్నా ఆ కేసులో పురోగతి లేదని, అసలు దోషులను తేల్చడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని తాను ఇటీవల అమిత్ షాకు విన్నవించినట్లు పేర్కొన్నారు. హత్య జరిగిన రోజు వివేకా గుండెపోటుతో చనిపోయాడనే విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్పారని అన్నారు. తాజాగా అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి మరో వ్యక్తి ఆ విషయం చెప్పాడని విజయసాయి రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
వైఎస్సార్సీపీలో అనేకమంది ఇబ్బంది పడుతున్నారు:అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి అబద్ధాలను అందంగా అల్లుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలను తట్టుకోలేకనే విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి బయటికి వచ్చారని ఆదినారాయణరెడ్డి అన్నారు. జగన్ లండన్ నుంచి ఇండియాకు వచ్చేలోపు చాలామంది ఆ పార్టీ నేతలు బయటికి వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. జగన్ బతిమాలినా విజయసాయిరెడ్డి పార్టీలో ఉండలేదంటే, ఆ పార్టీ అట్టడుగున ఉందనే విషయం గుర్తించుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ నుంచి బయటికి వస్తే ఆ పార్టీ నాయకులకు దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీలో ఉండలేక అనేకమంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
జగన్ లాంటి నేతలను వదిలించుకోవాలి: చిన్నాన్నను నరికి చంపితే గుండెపోటు అని ప్రచారం చేశారని, జగన్ లాంటి నేతలను వదిలించుకోవాలని ప్రజలను కోరుతున్నానని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర దిశగా మనం అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానీయవద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనేక రకాలుగా సాయం చేస్తోందని తెలిపారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్, స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం అండగా ఉందని గుర్తు చేశారు.