Minister Sridhar Babu Development of IT Towers in Karimnagar : జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్ నిర్మించినా అనుకున్న మేరకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎందుకు రావడంలేదో అధ్యయనం చేసి ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఐటీ పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు(IT Minister Sridhar Babu) చెప్పారు. ఐటీ టవర్లు నిర్మించినంత మాత్రాన ఐటీ వృద్ది జరగదని వాటిని బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐటీ రంగం హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితం కాకూడదని అన్నారు. తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించి అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
ఆరు గ్యారంటీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నాం : శ్రీధర్‌బాబు
Minister Sridhar Babu on Expand IT Towers : హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తున్న క్రమంలో కరీంనగర్లో కొంతసేపు ఆగి మీడియాతో శ్రీధర్‌బాబు మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ ఉనికి కాపాడుకోవడానికే ఆరాటపడుతున్నాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం కేవలం మేనిఫెస్టో(Sridhar Babu on Manifesto Discussion) ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు అవుతున్నాయి అనే అంశంపై చర్చ జరిగిందన్నారు. దీంతో పాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాత్రమే సమీక్ష జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల్లో మంచి విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు. మేడిగడ్డ నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియడమే కాకుండా దానికి సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వం రూపొందిస్తుందని స్పష్టం చేశారు.