Minister Payyavula Keshav On YS Jagan: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. తిరుమలకు వెళ్లేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. జగన్ మారలేదు, దురాలోచనలు మారలేదు అనటానికి ఇదే ఉదాహరణ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. తిరుమల వ్యవహరం జగన్‌కు రాజకీయం కానీ ప్రజలకు అది సెంటిమెంట్ అన్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందనేది నిజమని, లడ్డూ ప్రసాదంలో వినియోగించింది నిజమని వెల్లడించారు.
అపచారం జరిగిందనేది నిజమన్నారు. ఇవి ఎవరూ కాదనలేని వాస్తవామన్నారు. జగన్ అబద్ధమని, ఆయన చేసే పూజలు అబద్ధమని దుయ్యబట్టారు. గతంలో లడ్డూ నాణ్యతకు, ఇప్పుడున్న లడ్డూ నాణ్యతకు తేడా గురించి భక్తులనే అడగాలని జగన్‌ను కోరుతున్నానని అన్నారు. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. మహాద్వారం నుంచి సీఎం వెళ్లే అవకాశమున్నా, చంద్రబాబు మాత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు.
అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే రిజిస్టర్‌లో సంతకం పెట్టాలని అన్నారు. వెెంకటేశ్వర స్వామిపై జగన్‌కు విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల మనోభావాలతో ఆడుకున్నది చాలని హెచ్చరించారు.
మీరు చేసిన పాపాలు చాలని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దన్నారు. పాలక కమిటీ వేయడం మాత్రమే సీఎం చేస్తారని, టీటీడీ పరిపాలనతో సీఎంకు సంబంధం లేదని జగన్ చెబుతున్నారని, అయితే జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్‌ను టీటీడీలో ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు. టెండర్లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలను సడలించాలని జగన్ ఒత్తిడి తీసుకు రాలేదా అని నిలదీశారు.