kishan Reddy On Pragathi Nivedika :పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ లేకపోతే తాను లేనని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని 'ప్రగతి నివేదిక' పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్రమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ లేదని కేంద్ర మంత్రికిషన్ రెడ్డిపేర్కొన్నారు. ఒక బిల్డర్, కాంట్రాక్టర్ అనేవారు ఇప్పటివరకు తెలియదని వివరించారు. ఇప్పటివరకు ఏ గుత్తేదారును తాను బెదిరించలేదన్నారు. ఎప్పుడూ ఎవరిపైనా పక్షపాతధోరణితో వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై కొందరు చెప్పలేని భాషలో విమర్శలు చేశారన్న కిషన్ రెడ్డి అలాంటి వారికి ప్రజలే గతంలో బుద్ధి చెప్పారన్నారు. రాబోయే రోజుల్లో కూడా బుద్ధి చెబుతారన్నారు. తాను ప్రజలకు సేవ చేశానని భావిస్తేనే ఓటు వేయాలని లేదంటే వద్దని కేంద్రమంత్రి తెలిపారు. తనను గెలిపిస్తే మళ్లీ మీకు(ప్రజలకు) సేవచేసుకుంటానని ఆయన వివరించారు.
ప్రజలు భవిష్యత్ కోసం ఓటు వేయాలి :కిషన్ రెడ్డి మిత్రుడుగా మాత్రమే కాదని ఒక ఓటరుగా ఈ కార్యక్రమానికి వచ్చినట్లు లోక్‌సత్తా నేత జయప్రకాష్‌నారాయణ అన్నారు. దేశాభివృద్ధి కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు భవిష్యత్ కోసం ఓటు వేయాలని జయప్రకాష్ నారాయణ సూచించారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాలి కానీ అందుకోసం దేశాన్ని విచ్చిన్నం చేయవద్దన్నారు.