KCR Reacted on Budget Allocation 2024-25 :మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన శాసనసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బడ్జెట్‌లో ఒక్క వర్గానికి కూడా స్పష్టమైన హామీ లేదని వ్యాఖ్యానించారు.
బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయకుండా ప్రభుత్వం యాదవుల గొంతు కోసిందన్నారు. దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ బడ్జెట్‌లో మత్స్యకారులకు భరోసా లేదని ఎద్దేవా చేశారు. కొత్తగా ప్రస్తావించింది ఏమీ లేదని తెలిపారు. కొత్తగా సంక్షేమ పథకాలు లేవు, మహిళలకు కేటాయుంపుల పట్ల స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేదని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇది రైతు శత్రువు ప్రభుత్వం, అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు ఎగ్గొడతామంటున్నారని మండిపడ్డారు. గొర్రెల పంపిణీ ఊసే లేదని, దళిత బంధు ప్రస్తావనే లేకుండా దళితులను మోసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విధానమంటూ లేదన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలనే తాను అసెంబ్లీకి పెద్దగా రాలేదని చెప్పారు. భట్టి అంకెలను ఒత్తి పలకడం తప్పా చేసింది ఏమీలేదని ఎద్దేవాచేశారు. రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మా ఎమ్మెల్యేలు అడిగా స్పందనలేదని మండిపడ్డారు. ఇది ఎవరి బడ్జెటో రానున్న రోజుల్లో చెబుతామని కేసీఆర్ తెలిపారు.
'తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదు. బీఆర్ఎస్ హయాంలో మేం రెండు పంటలకు రైతుబంధు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎగ్గొడతామని చెబుతోంది. మేం రైతులకిచ్చిన డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వమని తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు చేయలేదు. విద్యుత్, నీటి సరఫరా, గొర్రెల పంపిణీ లేదు. రైతు భరోసా గురించి ప్రస్తావనే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, వృత్తి కార్మికులను వంచించింది. ఇది పేదల, రైతు బడ్జెట్ కాదు’ - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
అవినీతి, అసమర్థతతో పాలన చేతకాక కేంద్రాన్ని విమర్శిస్తున్నారు : కిషన్‌రెడ్డి - Kishan Reddy Fires On Congress BRS