JANASENA PAWAN KALYAN INTERVIEW : అరాచకాన్ని శ్వాసించి, విపక్షాలను హింసించి, జనాన్ని వేధించి, నరకమేంటో చూపించిన జగన్‌ను అవినీతిని ప్రేమించి, ఆక్రమణలతో లాభించి, అయినోళ్లను మాత్రమే లాలించి ఐదేళ్లుగా అందినకాడికి మేసేసిన జగన్‌ను, ప్రజాగ్రహం ఉప్పెనలా ముంచెత్తబోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. అభివృద్ధిని వదిలేసి, ఐదేళ్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చివరి ఘడియలు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. ఈ కష్టాలు, కన్నీళ్లు తుడవడానికే కూటమిగా ఏర్పడ్డామని పునరుద్ఘాటించారు. అధికారం చేపట్టిన మర్నాటి నుంచే నిత్యనాశనంగా సాగిన వైఎస్సార్సీపీ పాలనకు ముగింపు పలికి, కొత్త పునరుజ్జీవానికి దారులు పరచాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ‘ఈనాడు- ఈటీవీ భారత్ ’ ప్రతినిధులతో పవన్ ప్రత్యేక ముఖాముఖిలో ముఖ్యాంశాలు.
రాష్ట్రాన్ని నడిపించే శక్తి చంద్రబాబుది:చంద్రబాబు పరిపాలనా అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. అభివృద్ధి, సంక్షేమాన్ని చంద్రబాబు జోడెద్దుల్లా నడిపిస్తారు. ముఖ్యంగా సంక్షేమాన్ని వదలరు. నేనూ పోరాడే స్థాయిలో ఉన్నా. 2014లో పార్టీ ఎలా నడిపిస్తారని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పలేకపోయినా ఇప్పుడు సమగ్రంగా వివరించగలను. అనుభవం అంత విలువైంది. ప్రధానమంత్రి మోదీ కూడా బాగా పనిచేసేవారిని ఇష్టపడతారు. రాజకీయ విభేదాలున్నా దేశ సమగ్రతే ఆయనకు ముఖ్యం. నేనెప్పుడూ దేశ సమగ్రతపైనే మాట్లాడతానని మోదీకి తెలుసు. వ్యవస్థలను పాడు చేయకుండా అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అవసరం. మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడానికి ఇవన్నీ దోహదపడ్డాయి.
నేను గెలుస్తానని జగన్‌కు తెలుసు కాబట్టే అంత భయం : వైఎస్ షర్మిల - AP PCC YS Sharmila Interview
ఇసుక దోపిడీతో మొదలుపెట్టారు:2019లో జగన్ గెలిచిన తర్వాత ప్రమాణస్వీకారానికి విజయసాయిరెడ్డి ఫోన్ చేసి పిలిస్తే అభినందనలు తెలిపాను. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని చెప్పాను. ఆ ఎన్నికల్లో ప్రజలు సరైన వ్యక్తుల్ని ఎన్నుకోలేకపోయారనిపించింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఇసుకను అరుదైన వస్తువుగా ప్రభుత్వం మార్చేసింది. భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. 30, 40 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఇసుక విధానం సరిచేయలేదు. దోపిడీకి వనరుగా మార్చుకున్నారు. ప్రజావేదిక కూల్చేశారు. అప్పటి నుంచి విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. శాంతిభద్రతలను పూర్తిగా విచ్ఛిన్నం చేశారు.
"జగన్ అధికారంలోకి వస్తే విశాఖపట్నంలోని కొండకోనలు దోచేస్తారని గత ఎన్నికల్లోనే ప్రజలకు చెప్పాను. గత ఐదేళ్లలో విశాఖను అన్ని విధాలా దోచేశారు. ఉత్తరాంధ్రలోని కొండల్ని మింగేశారు. భూములపైకి గ్యాంగ్‌లను వదిలేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి హయాంలో ఈ గుంపు హైదరాబాద్‌లోనూ ఇలాంటి దారుణాలకే పాల్పడింది. వాటిని భరించలేకే అక్కడ తెలంగాణ ఉద్యమం బలపడింది. అప్పట్లో హైదరాబాద్‌లో నాకు తెలిసిన అనేక మందిని జగన్ గుంపు బెదిరించింది."-పవన్ కల్యాణ్, జనసేన అధినేత
మద్యనిషేధం ఎలా సాధ్యం:మద్యనిషేధం హామీ వెనుక డబ్బు సంపాదించుకునే పన్నాగం ఉందని ఆనాడే నాకు అనిపించింది. ఛత్తీస్‌గఢ్, యానాం, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను సరిహద్దులుగా పెట్టుకుని మద్యనిషేధం చేయటం సాధ్యమవుతుందా? జగన్ అధికారం చేపట్టాక మద్యనిషేధం చేయలేదు. మద్యం తయారీ, సరఫరా, కొనుగోళ్లు, విక్రయాలు అన్నింటినీ గుప్పిట పెట్టుకుని దోచుకుంటున్నారు. నాసిరకం మద్యం తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అది తాగితే నరాల బలహీనతలు వస్తున్నాయి. మద్యం సిండికేట్‌తో జనాన్ని లూటీ చేస్తూ నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు తీస్తున్నారు.
అందుకే జగన్ నాకు శత్రువు:భూములు దోచుకునేవారు, గూండాగిరీకి పాల్పడేవారు, రాజకీయాల్ని నేరమయం చేసినవారు నాకు శత్రువులు. ‘మా దగ్గర అధికారం ఉంది. మిమ్మల్ని ఏమైనా చేస్తాం’ అంటూ భయపెడితే వెనక్కి తగ్గను. ఇలాంటి దాష్టీకాలకు తెగబడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి నాకు శత్రువు. ఆ గుంపు దాష్టీకాన్ని వ్యక్తిగతంగా అనుభవించా. నా సినీ కెరీర్ తొలినాళ్లలో, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో వాటిని ఎదుర్కొన్నా. రాజకీయం చేయటం, అభిప్రాయం చెప్పటం ప్రాథమిక హక్కు. ఒక మొక్క ఎదిగి పది మందికి నీడనిస్తుందంటే దాన్ని వీళ్లు మొక్కగా ఉండగానే తుంచేస్తారు. అయినా తట్టుకుని నిలబడ్డాం. జగన్ గుంపునకు ఎలా ముకుతాడు వేయాలో నాకు బాగా తెలుసు.
2019 ఎన్నికల ముందు జనసేనతో పొత్తు కోసం వైఎస్సార్సీపీ నేతలు వచ్చారు. చాలా మంది మధ్యవర్తులు ప్రయత్నించారు. కానీ నేను అంగీకరించలేదు. ముందుకు తీసుకెళ్లలేదు. సైద్ధాంతికంగా నచ్చని వారితో స్నేహం చేయను. ఈ ఎన్నికల ముందు కూడా రకరకాల ప్రయత్నాలు జరిగాయి. అన్నీ విన్నాను. స్పందించలేదు.- పవన్ కల్యాణ్
చంద్రబాబుకే అలా జరిగితే మన పరిస్థితేంటి:చంద్రబాబు, నేను బంధువులం కాదు. కానీ ఆయనకు ప్రజాస్వామ్యంపై గౌరవ, మర్యాదలున్నాయి. వ్యవస్థల్ని బలోపేతం చేస్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అనేదే మా ఇద్దరిలో ఉన్న ఉమ్మడి లక్షణం. అదే మమ్మల్ని కలిపింది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి సంఘీభావం తెలియజేశాను. అదేదో ఆయన గతంలో నాకు సంఘీభావం ప్రకటించారని కాదు. తెలుగుదేశం పార్టీ సహా 5 కోట్ల మంది ప్రజలకు మానసిక స్థైర్యం ఇచ్చేందుకే. 40 ఏళ్లకు పైగా బలంగా పార్టీ నడిపిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వస్తే ఆనక మనందరి భవిష్యత్తు ఏంటనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందుకే నేను వెళ్లి ఆయన్ను కలిశాను. లేదంటే కోట్ల మంది ప్రజల మనస్సులు విరిగిపోతాయి. మానసిక స్థైర్యం దెబ్బతింటుంది.
మాకెందుకు అని మేమూ అనుకోవచ్చు కదా:ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా అందరిలా నేనూ కళ్లు మూసుకుని ప్రజాస్వామ్యం బాగుంది అనుకుంటూ బతికేయొచ్చు. 2019లో ప్రజలు తిరస్కరించినందున నేనూ వదిలేసి వెళ్లిపోవచ్చు. చంద్రబాబు ఇక నా వల్ల కాదు అనుకుని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. బీజేపీ నాయకులూ ఇలాగే అనుకోవచ్చు. భవన నిర్మాణ కార్మికులు నాకు ఓటేయలేదని నేను, అమరావతి రైతులు ఓటేయలేదని చంద్రబాబు ఎవరికి వారే మాకెందుకు అనుకోవచ్చు. కానీ మేం బాధ్యత తీసుకుని నిలబడ్డాం.
నేను కొంత తగ్గి, ముందడుగు వేశాను. చంద్రబాబు ఎంతో పాలనానుభవం ఉన్నవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పథకాలు తీసుకువచ్చినవారు. ఆయన్ను జైల్లో పెట్టడం వల్ల శారీరకంగా కొంత నలిగిపోయి ఉండొచ్చు కానీ మానసికంగా చాలా దృఢంగా ఉన్నారు. మా మధ్య కొన్ని విధానపరమైన విభేదాలు ఉండొచ్చు. వాటిని అధిగమించి, అందరం కలిశాం. మేం మా బాధ్యత నిర్వహించినట్లే సగటు మనిషి కూడా స్పందించాలి. రాజకీయాలతో సంబంధం లేదని అనుకోకూడదు. రాజకీయాలు మన జీవితాన్ని నియంత్రిస్తున్నాయి. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు ప్రతి ఓటరూ స్పందించాలి.
రాష్ట్రం నేరగాళ్ల అడ్డానా:ప్రతి రోజూ రాష్ట్ర వినాశనానికి దారి తీసే చర్యలు తప్ప జగన్ ఏం చేశారు? అన్నీ క్రిమినల్ చర్యలే. రాష్ట్రం నేరగాళ్లకు ఆలవాలమైపోతోంది. దాదాపు 31 వేల మందికి పైగా మహిళలు అదృశ్యమైపోయారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెప్పిన గణాంకాలే ఇవి. అనంతపురం జిల్లా ధర్మవరం వెళ్తే అక్కడ మహిళలు అదృశ్యమైన సంగతి నా దృష్టికి వచ్చింది. ఎక్కడ ఒంటరి మహిళలు, కుటుంబ మద్దతు లేని మహిళలు ఉన్నారో వారికి అన్యాయం చేస్తున్నారు. ముందు నమ్మకపోయినా క్రైం బ్యూరో రికార్డుల్లో గణాంకాలతో మాట్లాడాల్సి వచ్చింది. పార్లమెంటులోనూ మంత్రి ఇదే విషయం చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు ఎక్కువయ్యాయి.
వారే జగన్‌కు వ్యతిరేకమయ్యారు:రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎంచుకునేటప్పుడు ఒక నాయకుణ్ని ఎలా అంచనా వేయాలి? ఒక కంపెనీ షేర్లు కొనేటప్పుడు ఎవరైనా ఏం చూస్తారు? ముందు ఆ కంపెనీని నడిపేది ఎవరో చూస్తారు. ఆ కంపెనీ చరిత్ర తెలుసుకుంటారు. ఏమేం సాధించిందో చూసుకుంటారు. అన్నీ ఆలోచించి షేర్లు కొంటారు. ఒక కంపెనీలో పెట్టుబడి పెడితేనే ఈ స్థాయిలో లెక్కలు వేస్తారు. 2019కు ముందు అనేక మంది నాతో వాదించారు. జగన్‌కు ఎందుకు వ్యతిరేకంగా వెళ్తున్నావు అని అడిగినవారూ ఉన్నారు. ఆ రోజు రాజశేఖరరెడ్డి కుమారుడు అని కొందరు, సామాజికవర్గం కారణంగా మరికొందరు, ఒక పార్టీపై కోపంతో ఇంకొందరు ఆయనకు మద్దతిచ్చారు. 2019లో గెలిచిన తర్వాత ఆయన నిజస్వరూపం అందరికీ తెలిసింది. ఎంత విధ్వంసకారుడో అర్థమయింది. 2019లో ఆయనకు మద్దతిచ్చిన వారే, సర్వస్వం ధారబోసి ఎన్నికల్లో పని చేసినవారే ఈ అరాచకాలన్నీ చూసి ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు.
ఆయన అనుభవం, నా పోరాటం:ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన కూటమి సామాన్యుడి కోపానికి ప్రతిరూపం. అందుకే కూటమికి మద్దతుగా ఈ వేవ్ కనిపిస్తోంది. కూటమిలో 40 ఏళ్ల అనుభవముొన్న చంద్రబాబు ఉన్నారు. పోరాట పటిమ చూపుతూ కొత్త తరాన్ని ప్రతిబింబించే జనసేన ఉంది. జాతీయ రాజకీయాల్లో 2 పార్లమెంటు సీట్లతో ప్రారంభించి ఇప్పటికి అనేకసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉంది. మూడోసారి ప్రధాని కాబోతున్న మోదీ ఉన్నారు. వీళ్లంతా 2014లో కలిసి పోటీ చేసిన అనుభవం ఉంది. ఉమ్మడి కనీస కార్యక్రమం కింద కూటమి మరింత బలోపేతమయింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ కూటమికి జగన్ ఎంతో సహకరించారు. మా బాధ్యత ఎంతుందో ఆయనే మాకు గుర్తు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఆ హామీ నెరవేర్చకపోతే ఉద్యోగి ఎవరికి చెప్పాలి? వారి నాయకులకు చెప్పినా వాళ్లూ జగన్ చెప్పు చేతల్లో ఉండాల్సిన పరిస్థితి. ఎయిడెడ్ స్కూళ్లు తీసేశారు. ఫీజులు పెంచేశారు. ఇలాంటి సమస్యలు ప్రజలకు ఎన్నో. అవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? ప్రజల్లో సమష్టి ఆగ్రహానికి ఓ రూపంగా ఈ కూటమి ఏర్పడింది.
తెలుగుదేశం, జనసేన, బీజేపీల పొత్తుకు నేనే చొరవ తీసుకున్నాను. నేనే మధ్యవర్తిత్వం వహించాను. చాలా నలిగాను. రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కొంత తగ్గాను. ఇందుకోసం చాలా ఇష్టంగా పని చేశాను. ఈ పొత్తు కుదరడం సంతృప్తి కలిగించింది. 2022లో 70 కిలోమీటర్ల మేర ప్రజలు అడుగడుగునా మద్దతుగా నిలిచినా నేను పొంగిపోలేదు. నేలమీదే నడిచాను. నిర్మాణాత్మకంగా వ్యవహరించాను. కొన్ని సందర్భాల్లో ఇంత తగ్గకుండా మరింత బలంగా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ వ్యక్తిగతంగా తీసుకోలేదు. ప్రజల భవిష్యత్తు కోణంలోనే ఆలోచించాను. అందుకే తగ్గాను. ఈ పొత్తు రాష్ట్రానికి చాలా అవసరం. నా జీవితమంతా కత్తిమీద సామే.- పవన్ కల్యాణ్
ఎవరెలా బతకాలో కూడా ఆయనే నిర్దేశిస్తారా:జగన్‌మోహన్‌రెడ్డి అవినీతితో రూ.వేల కోట్లు సంపాదించారు. మనకు కంటి ముందు కనిపిస్తున్న ఆయన కంపెనీలే అందుకు ఆధారాలు. అక్రమ సంపద పోగేసుకుని దాంతో వ్యవస్థను శాసించాలని చూస్తున్నారు. బెదిరింపులు, అసభ్యపదజాలంతో విరుచుకుపడుతున్నారు. దాడులు, దౌర్జన్యాలతో అందర్నీ అణచివేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వారు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. వాళ్లు హింసనే నమ్ముకున్నారు. ఇది అత్యంత ప్రమాదకర నేరాలకు దారితీస్తుందని అప్పట్లోనే నాకు అర్థమైంది. వారు అధికారం చేపట్టాక నేను ఊహించిందంతా నిజమైంది. అక్రమార్జనలో మునిగితేలి, ఆ డబ్బులతో రాజకీయాలు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఎవరు ఎలా బతకాలో, ఎవరు ఎలా భయపడాలో నిర్దేశిస్తున్నారు. అధికారులను సైతం బెదిరిస్తున్నారు.