Jagan Lies About YCP Candidates:కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శుక్రవారం జరిగిన వైసీపీ ప్రచారసభలో తమ పార్టీ కర్నూలు లోక్‌సభ అభ్యర్థి బీవై రామయ్యతో పాటు, ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు బుట్టా రేణుక, విరూపాక్షి, శ్రీదేవి, సతీష్, ఇంతియాజ్, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలను పరిచయం చేస్తూ, వీళ్లంతా పేదవాళ్లైనా మంచివాళ్లు, సౌమ్యులంటూ అబద్ధాలు వల్లె వేశారు.
కడుపేద అభ్యర్థి 1:కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక 2014లో లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ 242 కోట్లు రూపాయలుగా తెలిపారు. ఈ పదేళ్లలో అవి ఎన్నో రెట్లు పెరిగి ఉంటాయి. 2014లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం రేణుకకు 2.250 కిలోల విలువైన రత్నాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. ఆమె కుటుంబ సభ్యుల దగ్గర మరో కిలో బంగారు నగలున్నాయి. 3.250 కిలోల ఆభరణాలున్నవాళ్లు సీఎం దృష్టిలో పేదవాళ్లు. ఆ నగల విలువే ప్రస్తుత ధర ప్రకారం 2 కోట్ల రూపాయలు.
రేణుక కుటుంబానికి బుట్టా ఎంటర్ ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఆటోమేటివ్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఫెసిలిటీ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా హాస్పిటాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఇంపెక్స్ అండ్ ట్రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, తేజస్వీ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలున్నాయి. రేణుక కుటుంబం నడుపుతున్న మెరిడియన్ స్కూళ్లు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిల్లో లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తారు.
మెరిడియన్ ఎడ్యుటెక్ సొల్యూషన్స్‌లో బుట్టా కుటుంబానికి ఉన్న 25 లక్షల షేర్ల విలువ 2014లోనే 25 కోట్లు రూపాయలు. రేణుక, ఆమె భర్త పేరు మీద హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. పంజాగుట్టలో ఊర్వశి హోటల్ ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. రేణుకది పేరుకే కర్నూలు జిల్లా అయినప్పటికీ ఆమె స్థిరపడింది, నివాసం ఉండేదీ హైదరాబాద్‌లోనే.
కడుపేద అభ్యర్థి 2:2019 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారమే ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆస్తుల విలువ 5.17 కోట్లు. ప్రియదర్శిని అర్బన్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌లో వాటాలు, షిర్డీసాయి కార్పొరేషన్‌లో ఆయన భార్యకు పెట్టుబడులున్నాయి. కొనకండ్ల, రామాపురం గ్రామాల్లో 43 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయన భార్య పేరు మీద మరో 6.97 ఎకరాలున్నాయి. ఆదోని, నంద్యాల, నూనెపల్లి వంటి చోట్ల విలువైన స్థలాలు, ఆదోనిలో సొంతిల్లు, కర్నూలులోని టీజే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ వంటి స్థిరాస్తులున్నాయి. ఆయన పేరు మీద 25 తులాలు, ఆయన భార్య పేరు మీద 96 తులాల బంగారం ఉంది.
ఇవన్నీ 2019 అఫిడవిట్‌లో వెల్లడించిన వివరాలే. బయట పెట్టని ఆస్తుల విలువ ఇంకెంత ఉంటుందో తెలియదో. భూకబ్జాలు, క్రికెట్ బెట్టింగ్, మట్కా, కర్ణాటక మద్యం అక్రమ రవాణా వంటి వాటితో కోట్లకు పడగలెత్తిన ఆయన పేదవాడట. గతంలో రోడ్లు బాగు చేయలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు ఆటో డ్రైవర్‌ను ఆయన అనుచరులు తీసుకెళ్లి విచక్షణరహితంగా కొట్టారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఓ జనసేన నాయకుడి ఇంటికి వెళ్లి మరీ ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. కానీ సీఎం దృష్టిలో ఆయన సౌమ్యుడు, మంచివారట.
కడుపేద అభ్యర్థి 3:2019లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే బాలనాగిరెడ్డి స్థిర చరాస్తుల విలువ రూ.2.29 కోట్లు. ఆయనకు 400 గ్రాములు, ఆయన భార్యకు 15 తులాల బంగారం ఉంది. మొత్తం 15 కిలోల వెండి ఉంది. వీరికి ఉన్న సుమారు 44 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ విలువను రూ.39.65 లక్షలుగా చూపించారు. ఆయనకు ఆదోనిలో వాణిజ్య భవనాలు, గుంతకల్లు, ఎమ్మిగనూరుల్లో విశాలమైన భవనాలు, కర్నూలులో సొంతిల్లు ఉన్నాయి. బీమా ఎడ్యుకేషన్ సొసైటీలో వాటాలున్నాయి. జగన్ దృష్టిలో ఆయన పేదవాడట. 2019 ఎన్నికల సందర్భంగా ఖగ్గల్లులో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని బాలనాగిరెడ్డి మనుషులు అడ్డుకుని దాడికిపాల్పడ్డారు.
తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రైవేటు వ్యక్తులను పురమాయించి రాళ్లు పాతించారన్న ఆరోపణలప వచ్చాయి. నియోజకవర్గంలోని కుంబళనూరు, మరళి, గుడికంబాలి, వల్లూరు, సాతనూరు, అగసనూరు, మాధవరం, చెట్నేపల్లి, మంత్రాలయం తదితర గ్రామాల్లో తుంగభద్ర నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అలాంటి వ్యక్తికి జగన్ సౌమ్యుడంటూ కితాబివ్వడం ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేసింది.