Harish Rao Visits Khammam Flood Effected Areas Today :తెలంగాణలో గత రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేనంతగా వాన కురిసింది. దీంతో మున్నేరు వాగు ఉప్పొంగి వరద నీరు సమీప గ్రామాల్లోకి చేరింది. ఈ క్రమంలో చాలా ఇండ్లు నీటమునిగాయి. చాలా వరకు ఇళ్లలోకి వరద నీరు చేరి బాధితులు సర్వం కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే వరద బాధితులను పరామర్శించేందుకు వివిధ పార్టీల నేతలు ఖమ్మం నగరానికి వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఇతర నేతలు ఖమ్మం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ వరద బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాలు సహా దస్త్రాలు, పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయని వాపోయారు.
సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం :వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఇళ్లపై నిలబడిన వరద బాధితులకు ఆహారం కూడా అందించలేదని ధ్వజమెత్తారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని, నష్టపోయిన వారికి తక్షణమే రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షం తగ్గి రెండురోజులు అయినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని అన్నారు. మంచినీరు, ఆహారం కూడా సరఫరా చేయలేదని దుయ్యబట్టారు.వరద బాధితులకు 5 కిలోల బియ్యం ఇస్తే ఎలా వండుకుంటారని ప్రశ్నించారు.
'ఇది ప్రకృతి తెచ్చిన విపత్తు కాదు - అధికార పార్టీ తెచ్చిన విపత్తు' - brs inspect Flood Affected Areas
రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రప్రభుత్వం కూడా విఫలమైంది. రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం ఎందుకు పంపలేదు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి. అందరం కలిసి వెళ్లి కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు బలైపోయారు. చనిపోయిన వారి సంఖ్యను కూడా ప్రభుత్వం తక్కువగా చూపుతోంది. వరదల్లో 30 మంది చనిపోతే కేవలం 16 మంది చనిపోయారని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సాగర్ ఎడమకాలువకు గండి పడింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేల ఎకరాల పంట నష్టం జరిగింది. రైతులకు ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలి. ఇసుకమేట వేసిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలి.
మాపై దాడులు చేస్తారా? :వరదలు వచ్చిన రోజు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడున్నారో చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. వరదల రోజు సీఎం సచివాలయానికి రాలేదని, సమీక్షలు జరపలేదని పేర్కొన్నారు. వరదలప్పుడు కేసీఆర్ బాగా చేశారని ఇవాళ ప్రజలు అంటున్నారని తెలిపారు. అన్నీ ప్రతిపక్షాలే చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని విమర్శించారు. వరదల్లో కూడా ప్రతిపక్షాపైనే సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సాయం చేయలేదని బాధపడిన వారిపైనా దాడులు చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిన తమ కార్లపై దాడి చేశారని అన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో 30వేల ఎకరాల్లో పంట నష్టం : సీఎం రేవంత్ - CM REVANTH VISITS MAHABUBABAD
పేదల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కించదు: సీఎం రేవంత్ - CM Revanth On Mahabubabad Rains