Harish Rao Comments on Congress and CM Revanth :కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా అయిదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం అంతే నిజమని చెప్పారు. రాష్ట్రంలో జిల్లాలను రద్దు చేసి కొత్తగా ఏర్పాటు చేస్తామంటున్న రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్(CM Revanth)తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, ఎన్నడూ జై తెలంగాణ అనలేదని దుయ్యబట్టారు. తెలంగాణ అంటే కాల్చేస్తానంటూ తుపాకీ పట్టుకొని తిరిగారని, అమర వీరులకు కనీసం శ్రద్ధాంజలి ఘటించలేదని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరమన్నారు.
ప్రస్తుత బీఆర్ఎస్(BRS) అప్పటి టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, సిద్దిపేట జిల్లా ఏర్పాటు అయ్యేది కాదని హరీశ్ రావు తెలిపారు. కొందరు నేతలు రానే రాదు అన్న తెలంగాణను గులాబీ అధినేత కేసీఆర్ చావు నోట్ల తలపెట్టి తెచ్చారని పేర్కొన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు.
BRS MP Elections Campaign :కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని యువత తిప్పకొట్టాలని, ఆ పార్టీవి గ్లోబల్ ప్రచారాలని హరీశ్ రావు విమర్శించారు. నాయకులు యువత నుంచే పుట్టుకొస్తారని, వారు భవిష్యత్‌లో రాజకీయాలలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి మాట్లాడారు. తన గెలుపులో యువత పాత్ర కీలకమని, గెలిచిన తర్వాత రూ. వంద కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి యువతకు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.