Election Commission Orders: అధికార వైసీపీ అడుగులకు మడుగులొత్తిన అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ముగ్గురు కలెక్టర్లు, ఐదుగురు ఎస్పీలు, ఒక రేంజ్ ఐజీని, ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరంతా తక్షణం విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యం, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఫిర్యాదుల మేరకు వీరిపై వేటు వేసింది. వేటు పడిన అధికారుల స్థానంలో ఇంఛార్జులుగా జేసీలను, అదనపు ఎస్పీలను నియమించింది. మరోవైపు ఆయా జిల్లాల్లో కొత్తవారిని నియమించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లను పంపింది.
ముగ్గురు జిల్లా కలెక్టర్లు, ఐదుగురు జిల్లా ఎస్పీలపై వేటు: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముగ్గురు జిల్లా కలెక్టర్లు, ఐదుగురు జిల్లా ఎస్పీలను విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లు పి. రాజబాబు, గౌతమి, లక్ష్మీషాలను విధుల నుంచి తప్పించిన ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వారి స్థానాల్లో ఇంఛార్జులుగా జాయింట్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు.
ఎన్నికల సంఘం సీరియస్ - ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ - IAS and IPS Officers Transfers
దిగువస్థాయి అధికారులకు బాధ్యతలు: ఈసీ ఆదేశాల మేరకు ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి , జోషువా, కెకె అన్బురాజన్ లను విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరందరినీ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. వీరి స్థానంలో దిగువస్థాయిలో ఉన్న అధికారులకు బాధ్యతలను అప్పగించారు. అటు గుంటూరు రేంజ్ ఐజీ జి. పాలరాజుపైనా ఈసీ వేటు వేయటంతో ఆ బాధ్యతల్ని ఏలూరు రేంజ్ ఐజీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకూ వీరెవరికీ ఎన్నికల సంబంధిత బాధ్యతల్ని అప్పగించొద్దని ఈసీ స్పష్టం చేసింది.
పింఛన్ల పంపిణీపై టీడీపీ విస్తృత పోరాటం - రంగంలోకి దిగిన చంద్రబాబు - Chandrababu Fight on Pensions
సీఈఓ 15 మంది ఐపీఎస్ అధికారుల పేర్లు: మరోవైపు బదిలీ అయిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమించే అంశంపై ప్రభుత్వం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమర్పించింది. ప్రతి స్థానంలోనూ ముగ్గురు అధికారుల ప్యానెల్ జాబితాను పంపాల్సిందిగా ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు మొత్తం 9 మంది ఐఎఎస్ అధికారుల పేర్లను, 15 మంది ఐపీఎస్ అధికారుల పేర్లను సీఈఓకి పంపించింది. సీఎస్ నుంచి వచ్చిన ప్రతిపాదనల్ని సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. గడచిన ఐదేళ్లుగా వీరిపై విజిలెన్సు క్లియరెన్సు ధృవీకరణను కూడా పంపాల్సిందిగా ఈసీ సూచించింది.
బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ - వారికి ఇంటి వద్దకే సొమ్ము - Pensions Distribution in AP