వైఎస్సార్సీపీ నాయకులకు తొత్తులుగా ప్రభుత్వ ఉద్యోగులు- చర్యలపై ప్రతిపక్షాల డిమాండ్ Govt Employees Election Code Violation: ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనవద్దని ఎన్నికల కమిషన్ అధికారులు ఎన్నిసార్లు సూచించినా కొందరు లెక్క చేయట్లేదు. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఎన్నికల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్సార్సీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉద్యోగుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల సేవల్లో కొందరు ఉద్యోగులు తరిస్తున్నారు.
బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి, కోడలు కావ్యకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా వీరిని భుజాల నెత్తుకుని ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఒంగోలులో మెప్మాలో పని చేస్తున్న కొందరు రిసోర్స్ పర్సన్స్ బాలినేని కోడలు కావ్యతో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి పరిచయాలు చేస్తున్నారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో బాలినేని కోడలు కావ్య మహిళలకు ఇచ్చిన విందులో కొందరు ఆర్పీలు కీలకంగా వ్యవహరించారు. ఆర్పీలు ఆయా ప్రాంతాల్లో ఉన్న మహిళలను గుర్తించి వారికి విందు ఏర్పాటు చేశారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలు - నామినేషన్ వేసేందుకు వెళ్తూ - Election Code violation
సోమవారం ఒంగోలు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఊరేగింపులో ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో అతనికి ప్రైవేటు గార్డులా ఓ కానిస్టేబుల్ పనిచేశారు. ఆయన నడుస్తుంటే దారి ఇవ్వడం, కార్యకర్తలు మీద పడకుండా చూసుకోవడం వంటి పనులను కానిస్టేబుల్ గోపి దగ్గరుండి చూసుకున్నారు. ఉద్యోగ దుర్వినియోగానికి పాల్పడుతున్న ఈయనపై తెలుగుదేశం నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు.
ఈ మధ్య టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ భార్య నాగ సూర్యలత ప్రచారానికి వెళ్లిన సందర్భంలో కొంతమంది ఆర్పీలు ఫోటోలు తీసుకున్నారు. దీనిపై బాలినేని ప్రతిష్ఠగా తీసుకొని ఆ ఆర్పీలను సస్పెండ్ చేయించారు. కేవలం ఫొటోలు తీసుకున్నందుకే సస్పెండ్ చేసిన అధికారులు ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రచారాల్లోనూ పాల్గొంటున్నా ఎలాంటి చర్యలు ఉండటం లేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఉద్యోగులపై తెలుగుదేశం నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు.
కాగా సత్యసాయి జిల్లాలో ఇటీవలే మాస్కులు ధరించి మరీ వైఎస్సార్సీపీ కార్యక్రమంలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంలో వైఎస్సార్సీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చంద్రమౌళి, వాలంటీర్లు, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమించి వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ కార్యకలాపాల్లో జోక్యం వద్దు - సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందన్న ఈసీ - EC ON ADVISORS