Governor Speech in AP Assembly Meetings:ఆంధ్రప్రదేశ్ 16 శాసనసభ మొదటి సెషన్ రెండో సమావేశంలో ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. శాసనసభ ప్రాంగణానికి వచ్చిన గవర్నర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టగానే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు.
వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2014లో జరిగిన విభజన రాష్ట్రానికి అత్యంత నష్టం చేకూర్చిందన్నారు. ప్రజలకు తీరని గాయాన్ని మిగిల్చిందని పదేపదే విభజనల కారణంగా రాష్ట్రానికి సుస్థిరాభివృద్ధిని దూరం చేసిందని చెప్పారు. ఈ సమయంలో 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలతో 13.5 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధికి దారీతీశాయని గవర్నర్ తెలిపారు.
రాష్ట్రం విడిపోవడం వల్ల ఏపీకి వాటిల్లిన నష్టాన్ని 2014 విభజన చట్టం పూడ్చలేకపోయింది. విభజన వల్ల నవ్యాంధ్ర ఆర్థికవ్యవస్థకు తీరని నష్టం వాటిల్లింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం సహేతుకంగా జరగలేదు. ఈ సంక్షోభాలన్నింటినీ 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం అవకాశాలుగా మలుచుకుంది. గతిశీల, సన్‌రైస్ ఆంధ్రప్రదేశ్ స్థాపనకు బలమైన పునాది వేసింది. 2014-19 మధ్య ఐదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకం స్పష్టంగా కనిపించింది. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోనే పూర్తిచేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తి చేశారు. ఇవన్నీ దార్శనికుడైన చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమయ్యాయి.
చంద్రబాబు విజనరీ నాయకుడు- ఏపీ అభివృద్ధికి పాటుపడ్డారు: గవర్నర్ - Governor Speech in AP Assembly
సామాజిక పింఛన్ల లబ్ధి పెంపు, రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఉపకార వేతనాలు, పేదలకు గృహాల నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకం చేశారు. ఈ రకమైన అభివృద్ధి, సంక్షేమ ప్రమాణాలతో 2014-19 మధ్య 13.5 శాతం వార్షిక వృద్ధిని రాష్ట్రం నమోదు చేసింది. 2014-19 మధ్య రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు లాంటి మైలురాళ్లకు చేరువయ్యే సమయంలో పాలనా మార్పు వల్ల నవ్యాంధ్ర అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించిందన్నారు. గత ఐదేళ్లు అసమర్ధ పాలన కారణంగా మరో పెద్ద అపజయాన్ని రాష్ట్రం చవిచూసిందనన్నారు.
2014లో జరిగిన రాష్ట్ర విభజన వల్ల కంటే 2019-24 మధ్య వైసీపీ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య హనన జరిగింది. ప్రజలు నిరంతరం భయంతో గడిపారు. స్వేచ్ఛను అనుభవించలేకపోయారు. గత ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలు రాష్ట్ర శ్రేయస్సును, ప్రగతిని దెబ్బతీశాయి. వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ విలువను కోల్పోయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ ముందుకురాలేదు. బెదిరింపులతో ప్రైవేట్ సంస్థల్ని మూతపడేలా చేశారు. ఉత్సాహవంతులైన పెట్టుబడిదారుల్ని, పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రం నుంచి బలవంతంగా వెళ్లగొట్టారు.
నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి - పోలీసులతో జగన్ దురుసు ప్రవర్తన - YS Jagan Fires on Police
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఇది పెను ప్రభావం చూపింది. బిల్లుల విడుదలలో నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన గుత్తేదారులు హైకోర్టును ఆశ్రయించారు. బిల్లుల చెల్లింపుల కోసమే హైకోర్టులో 25 వేల కేసులు దాఖలు కావడం దురదృష్టకరం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రమైన రాజధాని అమరావతి విజన్‌ను గత ప్రభుత్వం నాశనం చేసింది. అమరావతి కలను సర్వనాశనం చేసేందుకు హానికరమైన 3 రాజధానుల ప్రస్తావనను తీసుకొచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసింది. విద్యుత్, ఇతర రంగాలలో చేసుకున్న ఒప్పందాలను రద్దుచేయడం మరింతగా రాష్ట్రాన్ని ధ్వంసం చేశాయి. ఇలాంటి విపత్కర నిర్ణయాలు వాటి వల్ల తలెత్తిన అనూహ్య పరిణామాలు రాష్ట్ర యువతను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టేశాయి. ప్రభుత్వం మార్పు కోసం అంతా ఆతృతగా ఎదురుచూశారన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుని ప్రజలు ఇచ్చిన తీర్పుకు హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నట్టు గవర్నర్ స్పష్టం చేశారు. గడచిన ఐదేళ్లుగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేసిందని గవర్నర్ తెలిపారు.
వైసీపీ పాలనలో నాశనమైన వ్యవస్థలు, అన్ని రంగాల్లో జరిగిన భారీ అవినీతిపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు ప్రభుత్వ సంకల్పించింది. ఇందులో భాగంగానే వేర్వేరు రంగాల్లో జరిగిన అవినీతి, వనరుల దుర్వినియోగంపై మా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతోపాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మా ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తుంది. సహజ వనరుల దోపిడీ, మానవీయ విలువల విధ్వంసం వల్ల కలిగిన నష్టాన్నిపూడ్చి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయడం కష్టసాధ్యం. దీనికి కాస్త సమయం పడుతుంది. అలాగే వికసిత భారత్-2047 మార్గదర్శకాలను అనుసరిస్తూ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయడం అవసరం.
ప్రమాదమా? కుట్ర పూరితమా! - మదనపల్లె సంఘటనపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష - CM React Office Fire Accident
రాష్ట్రాన్ని పునర్నిర్మిచడానికి, కోల్పోయిన ఏపీ బ్రాండ్ విలువ, విశ్వాసం పెంచడానికి ఎన్డీయే కూటమికి ప్రజలు బలమైన విజయాన్ని అందించారు. ప్రజాహిత ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్య పునఃస్థాపనతో పాటు రాష్ట్రం కోల్పోయిన వైభవాన్ని, తిరిగి పొందేలా ప్రజలు విస్పష్టమైన తీర్పునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన సూపర్ సిక్స్ అమలుకు కట్టుబడి ఉన్నట్టు గవర్నర్ తెలిపారు. ట్రేడ్ మార్క్ లాంటి ప్రజా కేంద్రీకృత పాలనను తన ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి అక్కడి నుంచి ఆర్ధిక సహకారం అందేలా కృషి చేస్తున్నట్టు గవర్నర్ వివరించారు.