AP Nominated Posts 2024 :ప్రభుత్వం ఆర్టీసీ, పౌరసరఫరాలు, ఏపీఐఐసీ, వక్ఫ్ బోర్డు వంటి 20 కీలక కార్పొరేషన్లకు ఛైర్మన్‌లతో పాటు ఆర్టీసీకి వైస్‌ఛైర్మన్‌ను కూడా నియమించింది. వీటిలో ఏడు కార్పొరేషన్లలో 64 మంది సభ్యులకు చోటు కల్పించింది. మిగతా 13 కార్పొరేషన్లకు ప్రస్తుతానికి ఛైర్మన్లను మాత్రమే ప్రకటించింది.
రాష్ట్రంలో ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన సూత్రాన్నే, ఈ పోస్టుల భర్తీలోనూ వర్తింపజేసింది. టీడీపీ నుంచి 16 మందిని ఛైర్మన్లుగా, 53 మందిని సభ్యులుగా, జనసేన నుంచి ముగ్గురిని ఛైర్మన్లుగా, తొమ్మిది మందిని సభ్యులుగా, బీజేపీ నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, ఐదుగురిని సభ్యులుగా నియమించారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పోస్టు టీడీపీకు దక్కింది. ఇది తొలి విడత మాత్రమే. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, నియోజకవర్గ స్థాయి వరకు ఇంకా భారీగా నామినేటెడ్ పోస్టులు, వివిధ దేవాలయాలకు పాలకమండళ్లను ప్రకటించాల్సి ఉంది. వాటికీ ప్రస్తుత విధానంలోనే మూడు పార్టీల మధ్య సర్దుబాటు చేయనుంది.
యువతకు ప్రాధాన్యం :కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ఎంపికలో.. కష్టకాలంలోనూ టీడీపీను అంటిపెట్టుకుని అత్యంత విధేయత, అంకితభావం, చిత్తశుద్ధితో పని చేసిన వారికి ప్రాధాన్యమిచ్చారు. కొందరు అతి సామాన్యులను పదవులతో గౌరవించింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూనే, యువతకు ప్రాధాన్యమిచ్చారు. 20 మంది ఛైర్మన్లు, ఒక వైస్‌ఛైర్మన్ పోస్టుల్లో ఏడుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, ఒకరు ముస్లిం మైనార్టీకి చెందిన వారున్నారు. టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జుల్లో 11 మందికి, యూనిట్ ఇన్‌ఛార్జుల్లో ఆరుగురికి పదవులు లభించాయి. జనసేనకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, ఏపీ టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడ్కో) ఛైర్మన్ పోస్టులను, బీజేపీకు 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ పోస్టును కేటాయించింది.
ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం : ఇటీవలి ఎన్నికల్లో పొత్తులో భాగంగా టికెట్ దక్కని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు వంటి సీనియర్లకు ఈ పోస్టుల భర్తీలో సముచిత ప్రాధాన్యమిచ్చారు. కొనకళ్లను ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించారు. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు పోటీచేసి, రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ లేదా పెడన ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. ఇప్పుడు ఆయన్ను కీలకమైన ఆర్టీసీ ఛైర్మన్ పోస్టులో నియమించారు. అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంతో పీలా గోవిందు మొదట్లో కొంత అసంతృప్తితో ఉన్నా, అధినేత ఆదేశాలకు కట్టుబడి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ విజయానికి కృషి చేశారు. అందుకు గుర్తింపుగా ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల టీడీపీ టికెట్ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజుకే ఖాయమనుకున్నారు. యువగళం పాదయాత్ర విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. కానీ ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో బంగార్రాజుకు నిరాశ ఎదురైంది. ఇప్పుడాయన్ను కీలకమైన మార్క్‌ఫెడ్ ఛైర్మన్ పదవి వరించింది. ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గానికి టీడీపీ కన్వీనర్‌గా ఉన్న బొరగం శ్రీనివాసులుకు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అక్కడి నుంచి జనసేన అభ్యర్థిని బరిలో నిలపగా, శ్రీనివాసులు సహకరించారు. ఆయనకు ఏపీ ట్రైకార్ ఛైర్మన్ పదవి దక్కింది.
రఘురామ విజయానికి కృషి : ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమితులైన మంతెన రామరాజు పార్టీ ఆదేశాల మేరకు అసెంబ్లీ టికెట్ త్యాగం చేశారు. ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రామరాజే అభ్యర్థిగా పార్టీ మొదట్లో ప్రకటించింది. చివరకు అక్కడ రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వాల్సి రావడంతో, రామరాజు పోటీ నుంచి వైదొలిగారు. రఘురామ విజయానికి కృషిచేశారు. దానికి గుర్తింపుగా కీలకమైన ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఆయనకు దక్కింది. 2021 నుంచి డోన్‌లో టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న మన్నె సుబ్బారెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తొలుత ఆయనకే టికెట్ ఇస్తామని అధినేత ప్రకటించారు. చివరకు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వంటి సీనియర్ నాయకుడికి అవకాశమిచ్చారు. ఇప్పుడు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు.