KTR on Formula E Racing and Says Ready to Go Jail : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకే ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించామని మాజీమంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తన ఆదేశాల మేరకే హెచ్ఎండీఏ నుంచి 50 కోట్ల రూపాయలు చెల్లించారని వెల్లడించారు. దీని వల్ల ఏడాదిలోనే 700 కోట్ల లాభం సర్కార్‌కు చేకూరిందని చెప్పారు. ఇందులో అవినీతి ఎక్కడిదని, తనపై కేసు ఎందుకు పెడతారని ప్రశ్నించారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకా అని అన్నారు. ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని, రెండు, మూడు నెలలు జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధపడతానని వ్యాఖ్యానించారు. కోపంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్ములా ఈ రేసు రద్దు చేశారని మండిపడ్డారు.
చివరి నిమిషంలో ఫార్ములా ఈ రేసు రద్దు చేసి అంతర్జాతీయంగా చెడ్డపేరు తీసుకొచ్చారని, హైదరాబాద్‌కు నష్టం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పురపాలకశాఖపైనే కేసు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మొదటిసారి ఫార్ములా ఈ రేసింగ్‌కు తమ ప్రభుత్వం ఖర్చు పెట్టింది రూ.35 నుంచి 40 కోట్లు మాత్రమేనని, గ్రీన్ కో వంద కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఈ రేసుతో రూ.700 కోట్లకు పైగా లాభం వచ్చిందని నెల్సన్ సంస్థ నివేదిక ఇచ్చినట్లు గుర్తు చేశారు. అమర్ రాజా బ్యాటరీస్, హ్యుండాయ్ కంపెనీలకు భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయి, మరో రూ. 2500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ వివరించారు.
'రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి పెట్టాలి. హైదరాబాద్ ప్రతిష్ఠను దెబ్బతీయవద్దు. రాజ్ భవన్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను ఖతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు'- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు