ED Searches YSRCP Leader MVV Houses and Offices:వైఎస్సార్సీపీ నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిపై ఈడీ (Enforcement Directorate) పంజా విసిరింది. దిల్లీ నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందాలు ఉదయం నుంచి ఎంవీవీ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఏకకాలంలో నగరంలోని 5 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. విశాఖ లాసన్స్‌బే కాలనీలోని ఇల్లు కార్యాలయంలో ఈడీ బృందాలు ఉదయం 8 గంటల తర్వాత లోనికి వెళ్లారు. అదే విధంగా మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయం, ఐటీ సెజ్‌లోని నివాసంలో ఈడీ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి.
ఎంవీవీ సన్నిహితుడైన జీవీ ఇంటితో పాటు బ్రహ్మాజీ అనే వ్యక్తి నివాసంలో ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. దిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలకు రాష్ట్రంలోని ఈడీ బృందాలు సహకారం కొనసాగిస్తున్నాయి. ఈడీ అధికారులు తనిఖీల్లో తమకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఓసారి ఎంవీవీ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశాయి. అయితే ఈ సారి నేరుగా దిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు విశాఖ నగరంలోని ఐదు ప్రాంతాల్లో తనిఖీలు కొసాగిస్తున్నాయి.