Ponnavolu's controversial comments :గతంలో పక్క రాష్ట్రంలో ప్రెస్‌మీట్ పెట్టి పరువుపోగొట్టుకున్న మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్.. మరో సారి అంతే పని చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన అప్పటి ఏఏజీ పొన్నవోలు, సీఐడీ చీఫ్ సంజయ్ కేసు వివరాలను వెల్లడించే క్రమంలో అర్థం లేని అలంకారాలు ఉపయోగించి తమ అజ్ఞానాన్ని చాటుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు పుణెలో ప్రారంభమైందని సూటిగా చెప్పకుండా నాటకీయత జోడించే క్రమంలో అభాసుపాలయ్యారు. ‘గంగా నది నాసిక్‌లో పుట్టింది’ అని ఏఏజీ చెప్పగా.. 'అక్కడ పుట్టింది గంగ కాదు.. కృష్ణా నది' అని సంజయ్ సెలవిచ్చారు. గంగా కాదూ, కృష్ణా నదీ కాదు... మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకంలో గోదావరి నది ఉద్భవించిందనే విషయం వీరికి తెలియకపోవడం విడ్డూరం. ఇదిలా ఉంటే తాజాగా తిరుపతి లడ్డూ విషయంలోనూ అర్థం లేని అలంకారాలను ఉపయోగించారు పొన్నవోలు.
తిరుమల లడ్డూ వివాదంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడడం ఆందోళన కలిగిస్తోంది. సున్నితమైన అంశంపై అవగాహన లేకుండా వ్యాఖ్యానించడం భక్తుల మనోభావాలను గాయపరుస్తోంది. తిరుమల లడ్డూను పరమ పవిత్రంగా భావించే భక్తుల విశ్వాసాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం బాధిస్తోందని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పిల్ దాఖలు చేయగా ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెయ్యితో పోలిస్తే పంది కొవ్వు ధర ఎక్కువగా ఉంటుందని చెప్తూ తిరుపతి లడ్డూను తక్కువగా చూపే ప్రయత్నం చేశారు. పైగా ఎక్కడైనా బంగారాన్ని రాగితో కలుపుతారా? అంటూ వితండ వాదం కొనసాగించారు. చంద్రబాబు వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదని, ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో విచారణ జరిపించాలని అన్నారు.
తిరుపతి లడ్డూలో వినియోగించే ఆవు నెయ్యలో కల్తీ జరిగిందన్నది వాస్తవమని ల్యాబ్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కొవ్వు పదార్థాలతోపాటు ఫిష్ ఆయిల కలిసిందని నివేదికలు స్పష్టం చేశాయి. ఇపుడు దానిని వదిలేసి పొంతనలేని పోలికలను తెరమీదకు తీసుకురావడం విడ్డూరమని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.