Congress Door to Door Election Campaign : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ రాష్ట్రంలో ప్రచారం సాగిస్తోంది. ఇందులో భాగంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కమార్ రెడ్డి ఆలేరులో ఇంటింట ప్రచారం నిర్వహించారు. హోటల్‌లో స్వయంగా అల్పాహారం తయారు చేసిన కిరణ్‌కుమార్, విప్ బీర్ల ఐలయ్య, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి డ్రైనేజీ శుభ్రం చేసి ఓట్లు అభ్యర్థించారు.
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్కు 15 ఎంపీ స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కవవు అంటూ మంత్రి జోస్యం చెప్పారు. గత పదేళ్లలో బీజేపీ మతతత్వ రాజకీయం చేసి మతాల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు.
'తెలంగాణలో బీజేపీ ప్రజల్ని మత పరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. అభివృద్ధి పనులు ఏమీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అయితే కుప్పకూలిపోయింది. ఎన్నికల తర్వాత వాళ్ల మనుగడ నాకైతే ప్రశ్నార్థకమే. బీజేపీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, అప్పుల పాలు చేసింది. ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు.'-ఉత్తమ్ కుమార్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి
Minister Ponnam on BJP : కవిత అరెస్టుపై బీజేపీ, బీఆర్ఎస్లు డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీకి, తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదంటూ పొన్నం విమర్శించారు.