ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'బుద్ధి ఉన్నోడైతే చేయాలి' - ఓటు ఎలా అడుగుతావు జగన్?

cm jagan liqour policy : మా మేనిఫెస్టో బైబిల్, భగవద్గీత, ఖురాన్.. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదన్న జగన్.. ఎన్నికల మేనిఫెస్టోలో అత్యంత ప్రధానమైన మద్య నిషేధం హామీకి మంగళం పాడేశారు. 'మద్యాన్ని ఫైవ్​ స్టార్​ హోటళ్లకు పరిమితం చేశాకే 2024 ఎన్నికల్లో మేం ఓట్లు అడుగుతాం. మేనిఫెస్టోలో కూడా ఇదే చెప్పాం.' అన్న జగన్​ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్ని ఓట్లు అడిగే హక్కును ​ కోల్పోయారు.

cm_jagan_ap_liqour_policy
cm_jagan_ap_liqour_policy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 4:08 PM IST


cm jagan liqour policy : విశ్వసనీయతపై వేటు :'మాటలు కోటలు దాటాయే తప్ప.. చేతలు గడప కూడా దాటలేదు' అన్నట్లుగా ఉంది సీఎం జగన్​ వైఖరి. విశ్వసనీయతకు అర్థం తెలిసిన ప్రజలు తనను నమ్మి ఓట్లేశారని చెప్పుకొనే జగన్​ అదే విశ్వసనీయతను కాలరాశారు. నమ్మిన ప్రజలను నట్టేట్లో ముంచేశారు. ఏటా జాబ్​ క్యాలెండర్​ పేరిట యువతను బోల్తా కొట్టించి, మద్యపాన నిషేధం హామీతో అక్క, చెల్లెమ్మలను మోసం చేశారు. ఇక ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజల కష్టాలు సరేసరి.

మద్యపాన నిషేధాన్ని గాలికొదిలారు- అమ్మకాల్లో రికార్డులు బద్దలు కొడుతున్నారు

'2024 ఎన్నికల్లో మేం ఓట్లు అడిగే సమయానికి కచ్చితంగా మద్యాన్ని నిషేధిస్తాం. ఫైవ్​ స్టార్​ హోటళ్లకు పరిమితం చేశాకే ఓట్లు అడుగుతాం. మేనిఫెస్టోలో కూడా ఇదే చెప్పాం.' - అధికారంలోకి వచ్చాక సీఎం జగన్​ చెప్పిన మాటలివి

'మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా.. చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకైతే తెలియదు గానీ, బుద్ధి ఉన్నోడైతే చేయాలి. రెండు, మూడేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని గట్టిగా చెప్తా ఉన్నా' - ప్రతిపక్ష నేతగా జగన్​ వ్యాఖ్యలివి

ప్రతిపక్ష నేత హోదాలో ప్రగల్బాలు :2014 సంవత్సరంలో కల్తీ మద్యం బాధిత కుటుంబాల పరామర్శ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ ప్రగల్భాలు పలికారు. 'మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా.. చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకైతే తెలియదు గానీ, బుద్ధి ఉన్నోడైతే చేయాలి. రెండు, మూడేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని గట్టిగా చెప్తా ఉన్నా' అన్నారు. అప్పటికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా కాకముందే అంచనాలు వేసి మరీ మద్యం ఆదాయాన్ని లెక్కగట్టి రెట్టింపు చేసి చెప్పిన జగన్​.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు.

డిసెంబరు 31న ఏపీలో రూ. 156.60 కోట్ల మద్యం హాంఫట్! అబ్కారీ శాఖ ఖుషి ఖుషి

మొట్టమొదటి అవకాశం చంద్రబాబు నాయుడుకే ఇస్తున్నాం. అధికారంలో ఉన్నాడు చెయ్యమని కోరతా ఉన్నాం.. అనీ ఛాలెంజ్ చేశారు. జగన్​ అప్పుడేదో చేస్తాడు, చేయబోతాడు కాబట్టి ముందుకొచ్చి మద్య నిషేధం చేయమని డిమాండ్ చేస్తూ మీడియా ముందు ఊదరగొట్టారు. గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలులో ఉంది. కానీ, వాటిని చూసి మనం ఏం నేర్చుకున్నాం. బాగా డబ్బులున్నోడు, సూటు, బూటు వేసుకున్నోడు తాగి పడిపోయినా ఇబ్బందేం లేదు. పిల్లల చదువులు తప్పుతున్నాయి. పదో తరగతి పూర్తి చేసిన పిల్లోడు మద్యం షాపువైపు చూస్తున్నాడు. గ్రామాల్లో స్కూళ్లు, గుళ్ల ఎదురుగానే మద్యం షాపులు కనిపిస్తున్నాయి... చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటి అంటూ విమర్శలు గుప్పించారు.

మేనిఫెస్టో మాకు బైబిల్ :అధికారంలోకి వచ్చాక మద్యనిషేధం హామీపై మాట్లాడుతూ ప్రజల్లో అవేర్​నెస్​ కల్పించి, రిహాబిలిటేషన్​ సెంటర్లు పెంచాలి. నెక్ట్స్ ఎన్నికల్లో మేం ఓట్లు అడిగే సమయానికి మాత్రం కచ్చితంగా మద్యాన్ని ఫైవ్​ స్టార్​ హోటళ్లకు మాత్రమే పరిమితం చేసి ఓట్లు అడుగుతాం. మేనిఫెస్టోలో కూడా ఇదే చెప్పాం. అది ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావిస్తాం. అన్నారు.

ఇప్పుడు ఎలా అడుగుతావు జగన్? :2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్ని ఓట్లు అడిగే హక్కును జగన్​ కోల్పోయారు. ఎన్నికల మేనిఫెస్టోలో అత్యంత ప్రధానమైన మద్య నిషేధం హామీకి మంగళం పాడేశారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 2,934 మద్యం దుకాణాల సంఖ్యను ఒక్కటీ తగ్గించకుండా 2024 సెప్టెంబరు 30 వరకూ యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పదవీకాలం 2024 మే వరకే ఉంది. కానీ తాజాగా ప్రకటించిన మద్యం విధానం కాలపరిమితి 2024 సెప్టెంబరు నెలాఖరు వరకూ ఉంది. అంటే ఈ ప్రభుత్వ హయాం ముగిసే నాటికి రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నింటినీ ఆపేసి.. అయిదు నక్షత్రాల హోటళ్లకు మద్యం పరిమితం చేయట్లేదనే విషయాన్ని జగన్‌ ప్రభుత్వం తేల్చేసింది. అంటే మద్య నిషేధం హామీకి జగన్‌మోహన్‌ రెడ్డి నీళ్లొదిలేసినట్లేనని తేటతెల్లమైపోయింది.

పురందేశ్వరి ఇచ్చిన 'మద్యం ఫిర్యాదు'పై.. కేంద్రం సీబీఐతో దర్యాప్తు చేయించాలి : సీపీఐ

ప్రభుత్వం మారినా దుకాణాలు కొనసాగేలా :ఏటా దుకాణాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ మద్యనిషేధం అమలు చేస్తామన్న జగన్​ ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క మద్యం దుకాణాన్ని కూడా తగ్గించలేదు. పైగా పని వేళలు కూడా పెంచారు. రాత్రి 9గంటలకే మూతపడాల్సిన దుకాణాలను 10గంటల వరకూ తెరిచి ఉంచేలా ఉత్తర్వులు ఇచ్చారు. మద్యం దుకాణాల సంఖ్య 2019లో 3,500, 2020లో 2,934 ఉండగా ఆ తర్వాత 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాలతో పాటు ఇటీవల ప్రకటించిన 2023-24కి సంబంధించిన మద్యం విధానాల్లో దుకాణాల తగ్గింపు ఊసే లేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పదవీకాలం 2024 మే వరకే ఉంది. కానీ, 2024 సెప్టెంబరు నెలాఖరు వరకూ మద్యం విధానం కాలపరిమితి ప్రకటించింది. అంటే.. ఫైవ్​స్టార్​ హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం చేస్తామన్న హామీని జగన్‌ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది.

ప్రజల రక్తమాంసాలతో ప్రభుత్వ వ్యాపారం.. రాబడే లక్ష్యంగా విక్రయాలు

విచారణ కోరిన పురందేశ్వరి :మద్యం వ్యాపారంలో ఏటా రూ.25 వేల కోట్ల దోపిడీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. లీటర్‌ మద్యం తయారీకి 15 రూపాయలు ఖర్చయితే, దాన్ని 600 నుంచి 800 రూపాయలకు విక్రయిస్తున్నారని, పైగా 80 శాతం విక్రయాలను నగదు రూపంలోనే చేస్తున్నారని వెల్లడించారు. తాను ఓ మద్యం దుకాణదారు లక్ష విలువైన సరకు విక్రయించి 700 మాత్రమే డిజిటల్ పేమెంట్ తీసుకున్నారని మిగిలినదంతా నగదు రూపంలోనే దారిమళ్లించారని పురందేశ్వరి ఆరోపించారు.

మద్యం అమ్మకాలతోనే సంపాదన :రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు 'కాదు కాదు' సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని జనసేన అధినేత పవన్​ ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివేనని చిన్న గమనిక అంటూ గతంలో ట్వీట్‌ చేశారు.

కేంద్రం ఎందుకు స్పందించడం లేదు :వంద కోట్ల దిల్లీ లిక్కర్ స్కాంపై ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల ఏపీ లిక్కర్ దందాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

'జేబులు నిల్‌ ఖజానా ఫుల్‌'.. మద్యం సొమ్ముపై సర్కారు కన్ను!

ABOUT THE AUTHOR

...view details