ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రేపో ఎల్లుండో వైసీపీ ఐదో జాబితా - టికెట్​ ఉంటుందో ఊడుతుందో తెలియక నేతల టెన్షన్​

CM Jagan Discussions With YSRCP Leaders: వైసీపీలో నియోజకవర్గాల్లో ఇన్​ఛార్జ్​ల మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తప్పిస్తోన్న సీఎం జగన్ మరికొందరిపైనా వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం గడిచిన నాలుగు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. తమ టికెట్ చించొద్దని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి వచ్చి విన్నవించుకుంటున్నారు. తమకే అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఎంత మందిపై వేటు పడుతుందోనని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

CM_Jagan_Discussions_With_YSRCP_Leaders
CM_Jagan_Discussions_With_YSRCP_Leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 9:11 PM IST

CM Jagan Discussions With YSRCP Leaders: అధికార వైసీపీలో పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. ఇప్పటికే 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల టికెట్లు చింపేయడంతో మిగిలినవారిలో ఆందోళన పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేసేందుకు టికెట్ ఉంటుందా, ఊడుతుందా తెలియక ఆందోళనతో గడుపుతున్నారు.

పార్లమెంట్, అసెంబ్లీ పార్టీ ఇన్​ఛార్జిలను మార్చుతోన్న సీఎం జగన్ ఇప్పటికే 4 జాబితాల్లో 59 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల్లో ఇన్​ఛార్జీలను మార్చేశారు. మరికొన్ని కీలక స్థానాల్లోనూ ప్రస్తుతం ఉన్న వారిని తీసివేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్​ఛార్జీలు మార్పులతో అయిదో జాబితా సీఎం జగన్ రూపొందిస్తున్నారు.

రేపో, ఎల్లుండో ఆ జాబితాను విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎంవో నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కొత్త వారిని నియమించడం, కొన్నింటిలో నేతలను అటు ఇటుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల ఎంపీ స్థానం సహా శ్రీశైలం నియోజకవర్గంలో ఇన్​ఛార్జీ మార్చాలని వైసీపీ ఆలోచిస్తోంది.

మమ్మల్ని కాదని వస్తారా- వైసీపీలో మొదలైన తిరుగుబాటు! కాళ్లబేరానికి సిద్ధమైన అధిష్ఠానం

ఈ మేరకు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని పిలిపించారు. మార్పులపై చర్చించగా తనకు శ్రీశైలం నియోజకవర్గం నుంచి మరోసారి అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిసింది. తాను ఎంపీగా వెళ్లాలంటే తన కుమారుడు శిల్పా కార్తీక్ రెడ్డికి అసెంబ్లీకి పోటీకి అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం.

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ , బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సీఎంవో పిలుపు మేరకు క్యాంప్ ఆఫీస్​కి వచ్చి సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. పార్టీ చేసిన సర్వేలను వివరించి తీసుకోబోయే నిర్ణయాలని వారికి తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఇన్​ఛార్జి మార్పుపై కసరత్తు చేస్తుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తనకే తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు.

వైఎస్సార్సీపీ ఇంఛార్జీల నాలుగో జాబితా విడుదల

మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం సీఎంవోకు: తాడేపల్లిగూడెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యే, మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం సీఎంవోకు వచ్చి మంతనాలు జరిపారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సీఎంవోకి వచ్చి చర్చించారు. సర్వేలు నిరాశాజనకంగా ఉన్నాయని చెబుతూ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని పార్టీ ముఖ్యనేతలు ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ కొత్తగా నియమించే అభ్యర్థిపైనా చర్చించి సహకరించాలని కోరుతున్నారు.

ఓ వైపు కొత్త జాబితా తయారు చేస్తూనే, ఇప్పటి వరకు విడుదల చేసిన 4 జాబితాల్లో పలు చోట్ల వివాదాస్పదమైన స్థానాల్లో అభ్యర్థులను, అసంతృప్తులను బుజ్జగించడంపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. రేపల్లె పార్టీ ఇన్​ఛార్జిగా మోపిదేవిని తొలగించి ఈవూరు గణేష్​ను ఇటీవల నియమించారు. దీనిని మోపిదేవి అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. మోపిదేవికే ఇన్​ఛార్జి బాధ్యతలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నాయి.

ఇవాళ క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తనకు తిరిగి రేపల్లె ఇన్​ఛార్జిగా నియమించాలని పట్టుబట్టినట్లు తెలిసింది. దీనిపై సీఎం జగన్​ను కలసి సానుకూల నిర్ణయం తెప్పించుకోవాలని మోపిదేవి వేచి చూస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ పెద్దలను కలిశారు. నరసారావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పదవికి రాజీనామా చేయడం, పార్టీ వీడటంతో స్థానిక పరిస్ధితులపై ఆరా తీసినట్లు తెలిసింది.

పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా

ఇదే సమయంలో కొత్తగా ఎంపిక చేసే అభ్యర్థిపైనా సమాలోచనలు చేసినట్లు తెలిసింది. ఇటీవలే ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ ఇన్​ఛార్జిగా దద్దల నారాయణ యాదవ్​ను సీఎం జగన్ ప్రకటించారు. దీంతో కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మదుసూధన యాదవ్ అసంతృప్తితో ఉన్నారు. నారాయణ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే అనుచరులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. దీంతో పరిస్ధితిని సద్దుమణిగేలా చేయడంపై దృష్టిపెట్టారు. తాడేపల్లికి వచ్చిన ఎమ్మెల్యే మధుసూధన యాదవ్​ను పార్టీ పెద్దలు బుజ్జగించినట్లు తెలిసింది.

పార్టీ నేతలతో చర్చించి ఆయా నియోజకవర్గ పార్టీ ఇన్​ఛార్జిల మార్పులపై ధనుంజయరెడ్డి, సజ్జల చర్చించాక సీఎం జగన్ తుది జాబితా రూపొందిస్తున్నారు. ఇతరులను కాకుండా తమకే తిరిగి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్ధితుల్లో వచ్చే జాబితాలో తమకు టికెట్ వస్తుందో లేదోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

27 మందితో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల

ABOUT THE AUTHOR

...view details