CM Chandrababu Review on Revenue Issues: రెవెన్యూ సేవలు అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ధ్రువపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రెవెన్యూ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖలో ప్రజల అర్జీల పరిష్కారంపై థర్డ్ పార్టీతో ఆడిట్ చేస్తామని వెల్లడించారు. ఆన్లైన్ రికార్డులు మార్చి ప్రజలను భయపెట్టి భూములు కొట్టేసిన వారిపైన కఠిన చర్యలు వుంటాయని హెచ్చరించారు.
రెవెన్యూ శాఖను సమూల ప్రక్షాళన చేస్తామని, తప్పు చేసే అధికారులకూ శిక్ష ఉంటుందని తెలిపారు. రీసర్వేతో తలెత్తిన 2.29 లక్షల సమస్యల సత్వర పరిష్కారం, సమస్యలకు తావు లేకుండా రీ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన 7 వేల 827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టాలన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047పై ఉన్నతస్థాయి సమీక్ష:2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపేందుకు ఉద్దేశించి సీఎం చంద్రబాబు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్‌పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్-2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్‌ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్‌తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నారు.