Chandrababu Focus on Nominated Posts :రాష్ట్రంలో వైఎస్సార్సీపీని గద్దె దించి అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం, నామినేటెడ్ పోస్టులపై ఫోకస్ పెట్టింది. టికెట్లు త్యాగం చేసిన వారితోపాటు, పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన నాయకులు కూడా పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని వారికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికి కూడా సర్దుబాటు చేయాల్సి ఉండడంతో సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
NDA Govt Focus on AP Nominated Posts : ఇందులో భాగంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత ఉన్నా పొత్తులో భాగంగా సీటు త్యాగం చేసిన వారు, గత ఐదేళ్లు కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినవారికి గుడ్న్యూస్ చెప్పనుంది. అధికార అండతో వైఎస్సార్సీపీ చేసిన ఆరాచకాలపై పోరాడినవారు ఇలా వివిధ వర్గాల నాయకులకు త్వరలోనే శుభవార్త అందనుంది. వీరిలో పనితీరు, సమర్థత ఆధారంగా నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కసరత్తు ముమ్మరం చేశారు.
తుదిదశకు చేరిన నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ :మరో రెండు వారాల్లోపే ఈ భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా పోటీచేసిన బీజేపీ, జనసేన పార్టీలకు దామాషా పద్దతిలోనే నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయి. పనితీరు, సమర్థత, పార్టీపై అంకితభావం వంటి అంశాలే నామినేటెడ్ పదవులకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు కష్టపడి పనిచేశారు? పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఎవరు అంకితభావంతో నిర్వహించారు? ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం చిత్తశుద్ధితో పని చేసినవారు ఎవరనే అంశాల ప్రాతిపదికన రెండు, మూడు నివేదికలు తెప్పించుకున్నారు.